Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర
- విలేకర్ల సమావేశంలో పీడీఎస్యూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామకృష్ణ, ఎన్ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7,8 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో విద్యారంగం పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలపై 18 తీర్మానాలు ఆమోదించినట్టు తెలిపారు.విద్యను కాషాయీకరించటమేగాక, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఉవ్విళ్లూరూతున్నదని విమర్శించారు. నూతన విద్యావిధానం పేరుతో పేదలకు విద్యను దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎన్ఈపీని తెచ్చిందన్నారు. సంస్కరణల ముసుగులో విద్యా రంగాన్ని మరింతగా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణకు పూనుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా లేదని చెప్పారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యతో పాటు నాణ్యమైన, సమానమైన విద్య అమలు కోసం ఉద్యమాలు రానున్నాయని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. కులాల పేరుతో గురుకులాల ఏర్పాటు తగదని సూచిం చారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అనిల్, నరేందర్,ప్రవీణ్,సురేశ్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.