Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష మంది వ్యవసాయ కూలీలతో భారీ ర్యాలీ, బహిరంగ సభ
- హాజరు కానున్న కేరళ సీఎం పినరయ్ విజయన్ : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ఈ నెల 29న లక్ష మంది వ్యవసాయ కార్మికులతో ఖమ్మంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రకటించారు. ఆ బహిరంగ సభలో కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొంటారనీ, వ్యవసాయ కార్మికులంతా దీన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థలకు నిధులను తగ్గించి పనులను నీరుగారుస్తున్నదని విమర్శించారు. అట్టడుగు వర్గాలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు, దళిత మహిళలపై లైంగికదాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షలు వేయకుండా పూలదండలు వేసి విడుదల చేస్తున్న పరిణామాలను తప్పుబట్టారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ పునరావాస చట్టాలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తొక్కిపెడుతున్నదని విమర్శించారు. దీని ఫలితంగా పేదలు తమ హక్కులను కోల్పోతున్నారని వాపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, అర్హులందరికీ పింఛన్లు, దళిత బంధు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.