Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షుభిత, సంక్లిష్ట పరిస్థితుల్లో ఉద్యమాలకు రూపకల్పన
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు వీ.పీ.సాను
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు వీ.పీ.సాను తెలిపారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ ఒకవైపు కార్పొరేటీకరణ, మరోవైపు మతోన్మాదం చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలో అత్యంత సంక్షుభిత, సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ విద్యార్థి సంఘాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమాలకు రూపకల్పన చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.అందుకనుగుణంగా మహాసభలో పలు తీర్మానాలు రూపొందించి ఆమోదిస్తామన్నారు. నూతన విద్యావిధానంతో రాబోయే రోజుల్లో పేద పిల్లలే కాదు..మధ్య తరగతి వారు సైతం ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఇదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు విశ్వవిద్యాలయాల్లో అడుగు పెట్టేందుకు వీలే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. విద్యారంగాన్ని కాపాడేందుకు ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు ఆ రంగానికి సంబంధించిన నిపుణులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.