Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండపాక
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సంకల్ప ఆశీస్సు యాత్ర ఆదివారం రెండవ రోజూ కొనసాగింది. ఉద్యోగాల క్రమబద్దీకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగటానికి గజ్వేల్ నుంచి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేపట్టిన సంకల్ప ఆశీస్సు యాత్ర రెండో రోజు తిమ్మారెడ్డిపల్లి నుంచి ప్రారంభమైంది. తిమ్మారెడ్డిపల్లి నుంచి కొండపాక క్రాస్ రోడ్డు మీదుగా దుద్దెడ రాజీవ్ రహదారిపై నుంచి సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో 2016లో జీవో నెంబర్ 16 ద్వారా క్రమబద్దీకరణకు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కానీ అనివార్య కారణాల వల్ల క్రమబద్ధీకరణ ఇంతవరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా జరిగేలా చూడాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ సంకల్ప ఆశీస్సుల యాత్రను చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం సిద్దిపేట నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి యాత్ర బయలుదేరుతుందని తెలిపారు. ఈ యాత్రకు తెలంగాణ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉదయ భాస్కర్ సంఘీభావం తెలిపారు. యాత్రలో.. 475 అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీనివాస్ శంకర్, ప్రవీణ్, గోవర్ధన్, కృష్ణవేణి, గురుమూర్తి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిలర్స్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.