Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు నెల రోజుల ముందే రాజకీయాలు మాట్లాడతా..
- ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాబోయే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని ఆ విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి నుంచి రెగ్యులర్‌గా నల్లగొండలో పర్యటిస్తానని, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మరవనని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండదండగా ఉంటానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడనని, ఎన్నికలకు నెలరోజుల ముందే రాజకీయాలు మాట్లాడుతానన్నారు. నల్లగొండ నియోజక వర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానని, రైతు సాగునీటి కష్టాలు ఇప్పటికే పరిష్కరించానని తెలిపారు. నియోజకవర్గంలో ఏ పనికైనా ప్రజలు తనను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారని వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ నాలుగేండ్ల కిందటే నల్లగొండను దత్తత తీసుకున్నా అభివృద్ధి ఏమి జరగలేదని విమర్శించారు. దత్తత అనే మాటకు అర్థం తేవాలంటే పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండ నియోజక వర్గంలో ఏడాదిలోగా పట్టణంలో 5000, గ్రామాల్లో 300 ఇండ్ల చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. రోడ్లు వెడల్పు చేసి బొమ్మలు పెడితే అభివృద్ధి చెందినట్టు కాదన్నారు. విలేకరుల సమావేశంలో నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.