Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం అమలు చేయాలి
- పెండింగ్ టీఏ, డీఏ ఇవ్వని సర్కార్
- అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అంగన్వాడీలతో చేయిస్తున్న ఆన్లైన్ పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేకే భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. వందలాది మంది అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. గంటల తరబడి గేటు ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న జయలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణలో భాగంగా 14 రకాల రికార్డులను నమోదు చేస్తుండగా ఆన్లైన్ పని ఎందుకని ప్రశ్నించారు. స్మార్ట్‌ఫోన్‌లో రాత్రి, పగలు తేడా లేకుండా ఫొటోలు, వివరాల్ని నమోదు చేయాల్సి రావడం వల్ల పని ఒత్తిడి పెరిగి టీచర్లు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానం పేరిట అంగన్వాడీలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా నిలిపి వేసినప్పటకీ ఆ ప్రమాదం తప్పదన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి మాదిరిగా తెలంగాణలోనూ అంగన్వాడీలను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కర్నాటక మాదిరిగా ఇక్కడా హెల్త్ సదుపాయం కల్పించాలన్నారు. 2015 నుంచి అంగన్వాడీలకు టీఏ, డీఏలు చెల్లించడం లేదన్నారు. పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న వేతనం అంగన్వాడీలు నెలంతా తిరిగే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాల ఖర్చులకే సరిపోతుందని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్య లక్ష్మీ పథకం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలను ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు. పిల్లలకు రూ.5, గర్బిణులు, బాలంతలకు రూ.10 చొప్పున ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను టీచర్లుగా పిలుస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ స్కూల్ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సదుపాయాల్ని ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. 45 ఏండ్లుగా అంగన్వాడీలు పని చేస్తున్నా వాళ్ల సీనియారిటీకి గుర్తింపు లేదన్నారు. పంజాబ్‌లో ఆన్లైన్ పని విధానాన్ని రద్దు చేశారన్నారు. తెలంగాణలో కూడా ఆన్లైన్ పనిని రద్దు చేసే వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఉధృతమైన ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు మాట్లాడుతూ.. అంగన్వాడీలు పోరాడిన ఫలితంగా రూ.పది వేల నుంచి రూ.13,500 వేతనం పెంచుకున్నామన్నారు. మరో మారు సమరశీలంగా ఉద్యమించి కనీస వేతనం రూ.26 వేలను సాధించుకో వాల్సిన అవసరముందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందిస్తున్న టీచర్లు, వర్కర్ల శ్రమను గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత్వాల మెడలు వంచైనా ఆన్లైన్ పని విధానాన్ని రద్దు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శశికళ, మంగ, నాయకులు షేకమ్మ, విజయలక్ష్మీ, సీఐటీయూ జిల్లా నాయకులు యాదయ్య, విద్యాసాగర్, అంగన్వాడీ నాయకులు జయమ్మ, నాగమణి, చంద్రమణి, సుజాత, రాణి, సువర్ణ, లక్ష్మీ, అలివేణి పాల్గొన్నారు.