Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లతో హైదరాబాద్ ముస్తాబు
- నేటినుంచి అఖిల భారత మహాసభలు ప్రారంభం
- నేడు ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి విద్యార్థుల ప్రదర్శన
- పీపుల్స్ ప్లాజా వద్ద బహిరంగసభ
- ప్రధానవక్తగా త్రిపుర మాజీ సీఎం మాణిక్‌సర్కార్
- ఓయూలో ప్రతినిధుల సభను ప్రారంభించనున్న జస్టిస్ చంద్రు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/ఓయూ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలు హైదరాబాద్‌లోని ఉస్మాని యా విశ్వవిద్యాలయంలో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఎస్ఎఫ్ఐ జెండాలు రెపరెపలా డుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టుము ట్టూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) నిండా జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లతో విద్యార్థులు, ప్రతినిధులకు ఆహ్వాన సంఘం స్వాగతం పలుకుతున్నది. హైదరాబాద్ నగరంతోపాటు ఓయూలో గుండ్రంగా ఉండే పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అవి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. వాటిని చూసిన వారు మహాసభల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవడం గమనార్హం. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అఖిల భారత మహాసభలను నిర్వహించడం ఇదే మొదటిసారి. అందుకే ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు తలెత్తకుండా ఆహ్వానసంఘం జాగ్రత్తలు తీసుకుంటున్నది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద విద్యార్థుల ప్రదర్శన ప్రారంభం కానుంది. అనంతరం పీపుల్స్‌ప్లాజా వద్ద బహిరంగసభ జరగనుంది. దీనికి ప్రధాన వక్తగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరవుతారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను అధ్యక్షతన నిర్వహించే ఈ బహిరంగసభలో వక్తలుగా ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్, జాతీయ గర్ల్స్ కన్వీనర్ ధీప్సితా ధర్, ఉపాధ్యక్షులు దీనిత్డెంటా, కార్యదర్శివర్గ సభ్యులు నితీష్ నారాయణ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రతినిధుల సభను జస్టిస్ కె చంద్రు ప్రారంభిస్తారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 750 మంది ప్రతినిధులు హాజరవుతారు. విద్యారంగం, విద్యార్థుల సమస్యలు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రతినిధులు వాటిపై చర్చించి పలు తీర్మానాలను చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు.
ఏడు భాషల్లో స్వాగత ద్వారాలు...
అమరులను స్మరించుకుంటూ ఏడు భాషల్లో స్వాగత ద్వారాలు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తూ బురుజును ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసింది. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం (మల్లు స్వరాజ్యం ప్రాంగణం) నుంచి ఇటు ఓయూ ఎన్సీసీ గేట్, అటు పోలీసు స్టేషన్ వరకు వరకు ప్రధాన రహదారుల వద్ద భగత్ సింగ్, సమ్మక్క సారక్క, ఎస్ఎఫ్ఐ మాజీ నేత జనార్ధన్, కెప్టెన్ లక్ష్మి సెహగల్ పేరుతో స్వాగత ద్వారాలు సుందరంగా ఏర్పాటు చేశారు. ఓయూలో మల్లు స్వరాజ్యం వేదిక నుంచి ప్రధాన, అంతర్గత రహదారుల వెంట ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ, తోరణాలు, జెండాలు, ప్లె˜క్సీలతో విద్యార్థులను ఆకట్టుకునేలా అలంకరణ చేశారు. మల్లు స్వరాజ్యం వేదిక లోపల అందరినీ విశేషంగా ఆకట్టుకునేలా తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నతిని కండ్లకు కట్టినట్టు బురుజును ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల ఫొటోలను వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పూల కుండీలతో వేదికను సుందరంగా ముస్తాబు చేశారు.