Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు సంస్థల దాడులకు భయపడను
- బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపితే టార్గెట్
- ప్రజాస్వామ్య రక్షణకు దేశవ్యాప్త ఉద్యమం
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యాచరణ : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-ముషీరాబాద్
బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపే వారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదనీ, ఐ డోంట్ కేర్ అని అన్నారు. ఇది కేవలం తనపై జరుగుతున్న దాడి మాత్రం కాదని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని మహ్మదీయ ఫంక్షన్ హాల్లో సోమవారం తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..కేంద్రప్రభుత్వం కుట్ర పూరిత ధోరణి వల్ల హక్కులను కోల్పోతున్నామని, తెలంగాణ యువతీ, యువకులు దేశం కోసం ఆలోచించాలన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉన్నదనీ.. దేశవ్యాపంగా ప్రజలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి రాష్ట్రానికీ వెళ్లి ప్రజలను జాగృతం చేయాలన్నారు. ప్రధాని మోడీ పాలనలో దళిత విద్యార్థులకు దేశంలో ఎక్కడా స్కాలర్షిప్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో బాసర ఐఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తే విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వారి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించారని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియాను నేడు బీజేపీ ప్రయివేటు ఎస్టేట్‌గా మార్చివేసిందన్నారు. భావజాల వ్యాప్తి చేసే జాగృతి వంటి సంస్థలు దేశానికి అవసరం అని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో...
తెలంగాణ ఉద్యమం తరహాలోనే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య రక్షణకు కవులు, రచయితలు, విద్యార్థులు, ఉద్యోగులను ఏకం చేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి 2006లో ప్రారంభమైందని, 18 దేశాల్లో జాగృతి కమిటీలు పనిచేస్తున్నాయని తెలి పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జాగృతి ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా జాగృతిని విస్తరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ కు శ్రీకారం చుట్టనున్నామని తెలి పారు.ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నవీనచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యోగాల సంఘం నాయకుడు దేవిప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.