Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ముఠాలోని ఇద్దరు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బట్టల ఎగుమతుల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాలోని ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 9 కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఫెడ్రిన్తోపాటు డ్రగ్స్ తూకం వేసే యంత్రం, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, రూ.4,02,500, 10 సెల్ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బట్టల ఎగుమతి చాటున తమిళనాడు నుంచి హైదరాబాద్, పూణె మీదుగా అస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సింథటిక్ డ్రగ్ సరఫరా చేస్తున్నారు. సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబుతో కలిసి సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన మహ్మద్ కాసీమ్, రసుల్దీన్ మలేషియా తదితర దేశాలకు వెళ్లి ఎలక్ట్రానిక్స్ గూడ్స్(స్మగుల్గూడ్స్) తక్కువ ధరకు తెచ్చి విక్రయించేవారు. ఈ క్రమంలో 2013లో రసుల్దీన్కు అతని స్నేహితుడు ఇబ్రహీం కలిశాడు. డ్రగ్స్‌తో కూడిన సూట్‌కేసును మలేషియాకు స్మగ్లింగ్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. దాంతో రసుల్ దానిని మలేషియాకు తీసుకెళ్తుండగా మధురై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాంతో మూడు నెలలు అతను జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడైన కాసీమ్తోపాటు ఫరీద్, పైజల్ను డ్రగ్ స్మగ్లింగ్‌లోకి దింపాడు. వీళ్లంతా ఇతర దేశాలు తిరుగుతూ స్మగుల్ గూడ్స్ తెచ్చి విక్రయాలు చేస్తున్నారు. విదేశాల్లో వివిధ ప్రాంతాలపై అవగాహన ఉండటంతో చెన్నైలో సుడో ఎఫిడ్రిన్ సింథటిక్ డ్రగ్‌ను తయారు చేసి వాటిని బట్టలు, గాజులు, పిల్లల గిఫ్ట్ ప్యాకెట్లలో ప్రత్యేకంగా ఒక పొరను తయారు చేసి అందులో ప్లాస్టిక్ కవర్లలో 80 నుంచి 100 గ్రాములు నింపి పంపుతున్నారు. ఇలా నింపిన వాటిని హైదరాబాద్‌లోని జీవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్, పూణెలోని ఇండోఫైన్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు పంపిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 8, పూణె నుంచి 7 సార్లు 70 కిలోల సూడో ఎఫిడ్రిన్‌ను ఈ ఏడాది ఎగుమతి చేశారు.
బట్టలు లుంగీలు, పంచెలు, షర్ట్స్‌తో...
నాలుగు రోజుల కిందట చెన్నైలో రహీమ్ ద్వారా సింథటిక్ డ్రగ్‌ను అందుకున్న కాసీమ్, రసుల్దీన్ బస్సులో వివిధ కంపెనీలకు చెందిన బట్టలు లుంగీలు, పంచెలు, షర్ట్స్‌తో కూడిన ప్యాకెట్లతో హైదరాబాద్‌కు వచ్చారు. నాచారం ప్రాంతంలో ఒక లాడ్జీలో దిగారు. లాడ్జీ గదిలో తమతో తెచ్చుకున్న రామరాజ్ కాటన్ బట్టలకు సంబంధించిన ప్యాకెట్లకు పైనా, కింద ఒక పొరను తొలగించి అందులో డ్రగ్స్‌ను నింపుతున్నారు. ఇలా సాధారణ బట్టల ఎగుమతి మాదిరిగా ఈసీఐఎల్ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచా రంతో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ నేతృత్వంలో మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు, నాచారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి కాసీమ్, రసుల్దీన్ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఫరీద్, పైజల్, రహీమ్ పరారీలో ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలపై దర్యాప్తు జరుగుతుందని సీపీ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకో వడంలో కీలకంగా వ్యవహారించిన ఎస్ఓటీ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, ఏసీపీ పి.నరేష్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు ఏ.రాములు, టీ.కిరణ్‌కుమార్, ఎస్ఐలు వాసుదేవ్, జి.రాఘు రాముడు, ఎం.సారంగసాణీతోపాటు ఎస్వోటీ, నాచారం పోలీసులు పాల్గొన్నారు.