Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలోని త్రిసూర్‌లో ఘనంగా ఏర్పాట్లు
- అక్కడకు చేరుకున్న ఐదు రైతు అమరవీరుల జ్యోతి యాత్రలు
- తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక మీదుగా కేరళకు
- అడుగడుగునా నీరాజనం పలికిన అన్నదాతలు
- పలుచోట్ల 3కే, 2కే, 1కే రన్‌తో స్వాగతం
- 16న బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం పినరరు విజయన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళలోని త్రిసూర్ పట్టణంలో అఖిల భారత రైతు సంఘం(ఏఐకేఎస్) 35వ మహాసభలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని కడవెండి, తమిళనాడులోని సేలం జైలు, కిళ్వన్మణి, కేరళలోని కొయ్యూరు, పున్నప్ర-వాయలార్ ప్రాంతాల నుంచి చేపట్టిన రైతు అమరవీరుల జ్యోతి యాత్రలు సోమవారం సాయంత్రం త్రిసూర్‌లో కలుసుకున్నాయి. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఆ ఐదు ప్రాంతాలు రైతాంగ, కూలీ పోరాటాలకు ప్రసిద్ధి చెందినవనే విషయం విదితమే. అవి భూమి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం, కూలీల పెంపు కోసం పేద రైతులు, కూలీల రక్తం చిందిన పోరాట గడ్డలే. పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండి నుంచి ఈ నెల ఐదో తేదీన మొదటి యాత్ర ప్రారంభమైంది. దీనికి ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ నాయకత్వం వహించారు. ఈ యాత్ర తెలంగాణలో బయలు దేరి ఏపీ, కర్నాటక, తమిళనాడు మీదుగా త్రిసూర్‌కు చేరుకున్నది. తమిళనాడులోని నాగపట్నం జిల్లా కిల్వన్మణిలో 25 డిసెంబర్ 1968న భూస్వాముల చేతుల్లో పోరాటంలో ఉన్న 44 మంది దళిత వ్యవసాయ కూలీలు వీరమరణం పొందారు. అక్కడ నుంచి రెండో యాత్ర ఈ నెల ఆరున ప్రారంభమైంది. మూడో యాత్ర ఈ నెల 9న తమిళనాడులోని సేలం జైలు నుంచి ప్రారంభమైంది. 22 మంది వీరమరణం పొందినటువంటి ప్రాంతం. నాలుగో జాత కొయ్యూరు అమరవీరుల ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఐదో యాత్ర పున్నపు వాయిలార్ ప్రాంతం నుంచి త్రిసూర్‌కు చేరుకున్నది. ఆయా పోరాటాల అమరవీరులను స్మరించుకుంటూ బయలు దేరిన ఈ యాత్రలకు ప్రజలు, రైతులు అడుగడుగునా నీరాజనం పలికారు. పాలక్కాడ్ జిల్లా నుంచి త్రిసూర్ వరకు ప్రతి కిలోమీటర్‌కు ఒక బృందం ఒన్కే రన్లో పాల్గొన్నది. మరికొన్ని ప్రాంతాల్లో 3కే, 2కే రన్ కార్యక్రమాలు చేపట్టారు. సభలను నిర్వహించి రైతాంగ పోరాటాల గురించి వివరించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రావాల్సిన పోరాటాల ఆవశ్యకత గురించి విడమర్చి చెప్పారు. కేరళలోని త్రిసూర్ జిల్లా కేంద్రంలో (లూలూ ఫంక్షన్ హాల్) కొడియేరి బాలకృష్ణనగర్‌లో మంగళవారం ఉదయం ఏఐకేఎస్ 35వ మహాసభలను ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్ల ప్రారంభించనున్నారు. 16న జరిగే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ఎనిమిది వందల మంది ప్రతినిధులు రానున్నారు. తెలంగాణ నుంచి 40 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ మహాసభల్లో రైతు సంఘాల నేతలు రాకేష్ టికాయత్, దర్శన్ పాల్, అతుల్ కుమార్ అంజన్, రాజారామ్, ఉగ్రహాన్, తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. పలు ప్రజా సంఘాల జాతీయ నాయకులు సౌహార్ధ్ర సందేశాలను ఇవ్వనున్నారు.