Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సమాజ నిర్మాణంలో శాస్త్రవేత్తలు మార్గాలు చూపాలి
- ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్
నవతెలంగాణ-ఓయూ
మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్‌గున్యా సహా అనేక జబ్బులకు దోమలే కారణమని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. దోమల నివారణ, ఆరోగ్య సమాజ నిర్మాణంలో జీహెచ్ఎంసీ లాంటి సంస్థల ప్రణాళికలకు శాస్త్రవేత్తలు మార్గాలు చూపాలని కోరారు. ఓయూ దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో ఓయూ జంతుశాస్త్ర విభాగం, సొసైటీ ఆఫ్ ఆర్త్రోపొడాలజీ సంయుక్తంగా ''మలేరియా, జూనోటిక్, వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ - పరిశోధనలో సవాళ్లు, అవకాశాలు'' అంశంపై మూడ్రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ 15వ అంతర్జాతీయ సదస్సును ఓయూ వీసీ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికత వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చినా దోమలను నిర్మూలించే దిశగా ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తెలంగాణ దూసుకుపోతున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల వ్యవధిలోనే వ్యవసాయం, సాగునీటి పారుదల తర్వాత వైద్య రంగంలో సంచలన విజయాలు సాధించిందన్నారు. కేసీఆర్ కిట్, గర్భిణులకు ఆరోగ్య సేవలు, పౌష్టికాహార లభ్యత కల్పించటం సహా జిల్లాల వారీగా వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్టైందని స్పష్టం చేశారు.
ఈ సదస్సులో సొసైటీ ఆఫ్ ఆర్త్రోపొడాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ బి.కె త్యాగి కీలకోపన్యాసం చేశారు. ఐసీఎంఆర్, వీసీఆర్సీ పుదుచ్చెరి మాజీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దాస్, అమెరికాలోని మెచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కరీం ఎం మరిడియా, మలేషియాలోని మలయా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఇంద్ర వైతిలింగం, నేపాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నుంచి డాక్టర్ రోషన్ కుమార్, ఓయూ జీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎస్.జితేంద్ర కుమార్ నాయక్, ప్రొఫెసర్ బానోత్ రెడ్యానాయక్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఎం.మాధవి, నాగేశ్వరరావు సహా ఇతర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సదస్సులో సమర్పించారు.