Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత వృత్తిపై బీజేపీది కపట ప్రేమ
- జీవో 560ని అమలు చేయాలి
నవతెలంగాణతో టీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ
'కార్మికుల కష్టాల నుంచే మా సంఘం పుట్టింది. 65 ఏండ్ల ప్రస్థానంలో పోరాటాల ద్వారా ఎన్నో విజయాలను సాధించాం. గీతకార్మికులకు, వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలబడ్డాం. పాలకులు మారినప్పుడల్లా గీత వృత్తిపై వారి వైఖరి మారుతూ వచ్చింది. ఆధునీకరణ రాగంతో పాలకులు బహుళజాతి కంపెనీల పానీయాలకు గేట్లు బార్లా తీశారు. కల్లు చెడ్డది, కూల్‌డ్రింక్ గొప్పదని చెప్పకనే చెబుతున్నరు. కేంద్రంలోని బీజేపీ పాలకులు స్వదేశీ జపం చేస్తూ విదేశీ మద్యంపై ఆంక్షలు తొలగించి విదేశీ లిక్కర్ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచింది. కర్నాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనింది. ఇటీవల యాదగిరిగుట్టలో జరిగిన రాష్ట్ర మూడో మహాసభ తీర్మానాలను సంబంధిత మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం' అని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ చెప్పారు. రాష్ట్రంలోని గీత కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 560ని అమలు చేయాలన్నారు. ప్రతి సొసైటీకి ఐదేకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం '65 ఏండ్ల ఉద్యమ యాత్ర' సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి ఎస్.వెంకన్నకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
- 65 ఏండ్ల కల్లుగీత కార్మిక సంఘం సాధించిన విజయాలేంటి?
బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకూ పాలకులు ఎవరైనా కల్లుపై సవాలక్ష ఆంక్షలు, పన్నులు విధిస్తూ పోతూనే ఉన్నారు. వేలం పాటల రద్దు కోసం పెద్ద పోరాటాలే చేశాం. మైహిపూజ్ చట్టం రద్దు చేయించుకున్నాం. ఆ పోరాటానికి ఎస్ఆర్ దాట్ల ఆ పోరాటాలకు నాయకత్వం వహించారు. 1955లో గీత కార్మికుల పోరాటంతో అప్పటి సర్కారు దిగొచ్చి కల్లుపై నిషేధం తొలగించింది. గీత కార్మికులు తాటి చెట్లపై జెండాలెగిరేశారు. తెలంగాణలో ధర్మబిక్షం, తోట్లమల్సూర్, పలుసం భిక్షం, కళ్లెపు వెంకటయ్య, దేశిని చినమల్లయ్య, బైరు మల్లయ్య, పెరుమాళ్ల జగన్నాథం, బలగాని పుల్లయ్య, మొరిగాడి యాదగిరి తదితరులు గీత కార్మికులను సంఘటితం చేశారు. పోరాటాల్లో నిలబెట్టారు. 1957లో గార్లలో మొదటి మహాసభ నుంచి మొన్నటి యాదగిరిగుట్ట మహాసభ వరకు దారిపొడుగునా..పోరాటాలే. వాటి ద్వారానే సొసైటీలను ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రస్తుతం రాష్ట్రంలో వృత్తి పన్ను రద్దు, పెన్షన్, ఎక్స్‌గ్రేషియా పెంపు, నీరాకు అనుమతి, సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వ హించటం తదితరాలూ పోరాడి సాధించుకున్నవే.
- గీత వృత్తిదారులను ఆదుకుంటామని బీజేపీ చెబుతున్న దాంట్లో నిజమెంత?
అవన్నీ మోసపూరిత మాటలే. ఆ పార్టీ అదికారంలో ఉన్న చోట గీత వృత్తిని బొందపెట్టే విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. కర్నాటకలో అదే చేసింది. కల్లును నిషేధించి కార్పొరేట్ కంపెనీల శీతల పానీయాలను ప్రమోట్ చేస్తున్నది. విదేశీ మద్యంపై ఆంక్షలు ఎత్తేసింది. తెలంగాణలోనేమో గీత కార్మికుల పక్షాన పోరాడుతున్నట్టు నటిస్తున్నది.
- వృత్తిదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి?
రాష్ట్రంలో ఐదు లక్షల మందికిపైగా గీత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల తాటి, ఈత చెట్లు క్రమంగా అంతరించి పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీవో నెంబర్ 560ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ భూమి ఎక్కడున్నా చెట్లు పెంచుకునేందుకు ఐదెకరాలు సొసైటీకివ్వాలి. దరఖాస్తు పెట్టుకున్నా భూమి కేటాయించలేదు. మరో పక్క కల్లుకు మార్కెట్ లేదు. బెల్టుషాపులు ఊర్లల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో కల్లు అమ్మకాలు పడిపోతున్నాయి. గీత వృత్తిదారులకు లబ్ది చేకూర్చేందుకుగానూ నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. దీంతో కార్పొరేట్ శీతల పానీయాల వల్ల జరుగుతున్న అనర్ధాలనుంచి ప్రజలను కాపాడొచ్చు.
- తాటి చెట్టు ఎక్కే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
మోకు, ముస్తాదు వాడటం వల్ల 2014నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు వేల మంది చెట్టుమీది నుంచి కింద పడ్డారు. ఆరు వందల మంది చనిపోయారు. మరే వృత్తిలోనూ ఇంత జీవన పోరాటం లేదు. కాబట్టే..కొత్త తరం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక పరిజ్ఞానంతో పరికరాలు అభివృద్ధి చేయాలి. కార్మికులకు ఇవ్వాలి. కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం యువతకు లోన్లు ఇచ్చి ఆదుకోవాలి. 'నీరా'ను బాటిలింగ్ విధానంలో ఆధునీకరించాలి. బెల్లం, చెక్కర, సిరఫ్, చాక్లెట్టు, తాటి కమ్మలతో బుట్టలు, దండలు, బొకేలు, అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు. ఇందుకు తగిన ప్రొత్సహాకాన్ని ప్రభుత్వం అందించాలి. చనిపోయిన వారి కుటుంబానికి రూ.ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో అందిస్తున్నది. శాశ్వత వికలాంగులకు రూ. 5లక్షలు ఇస్తున్నది. తాత్కాలిక వికలాంగులకు రూ.10వేలే అందుతున్నది. ఓవైపు వృత్తి చేసుకోలేక, మరోవైపు కుటుంబ భారాన్ని మోయలేక వారు నానాయాతన పడుతున్నారు. చెట్టుమీది నుంచి పడ్డ కార్మికునికి సొసైటీలో సభ్యత్వం ఉండాలి. బోర్డు నిబంధన ప్రకారం రెండు ప్రధాన అవయవాలు పోతేనే శాశ్వత వికలాంగుడిగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. దీన్ని సవరించి న్యాయం చేయాలి. లైసెన్స్ రెన్యూవల్‌ను పదేండ్లకు పెంచింది. రూ.16కోట్ల పన్ను రద్దు చేసింది. నీరా పాలసీని తీసుకొచ్చింది. వీటితో సరిపెట్టకుండా గీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. గీతన్న బంధు ప్రకటించాలి. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలి. గీత కార్మికులందరికీ ఉచితంగా ద్విచక్ర వాహనాలివ్వాలి.
- 65ఏండ్ల యాత్ర సందర్భంగా తీసుకోబోతున్న కర్తవ్యాలేంటి?
వృత్తి ఆధునీకరణకు కృషిచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. 'కల్లుగీత వృత్తి నాడు, నేడు, భవిష్యత్' అనే అంశంపై ప్రతి జిల్లా, పట్టణ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి గ్రామంలోనూ జెండాలు ఎగరేస్తాం. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు సన్మానాలు చేస్తున్నాం.