Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిచో సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామంటూ సోమవారం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రంగారెడ్డి జిల్లా ఆశావర్కర్లు సుమారు 400 మంది ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకొని వారికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. ఇటీవల ఆశాలకు లెప్రసీ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే క్షేత్రస్థాయిలో ఈ సర్వేలో ఆశావర్కర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్కూటమి డబ్బాలు ఆశాలతో మోపించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి నిర్వహించే కంటి వెలుగు పనికి అదనంగా డబ్బులు చెల్లించాలని కోరారు. వారికి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పక్క రాష్ట్రం ఏపీలో ఇస్తున్నట్టు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. కరోనా రిస్క్ అలవెన్స్ 16 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ఆశాల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచి జిల్లాలో ఉన్న ఆశావర్కర్లకు రూ.9,600 జీతం ఇచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. లెప్రసీ సర్వే మగవారికి తప్పనిసరి కాదని, స్కూటమి డబ్బాలను ఆశాలతో మోపించే విధానాన్ని రద్దు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సునీత, అధ్యక్షులు కవిత, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, సాయిబాబా, దేవేందర్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, కురుమయ్య, ఆశావర్కర్లు అనిత, వసంత, సుజాత, అరుణ, తదితరులు పాల్గొన్నారు.