Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ ఏవోఐ) రాష్ట్ర మహాసభలో ప్రధాన కార్యదర్శి డా.పీ.జీ దిలీప్
నవతెలంగాణ-ఖమ్మం
ఎల్ఐసీ ఏజెంట్లు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేయాలని ఎల్ఐసీ ఏవోఐ ప్రధాన కార్యదర్శి డా.పీ.జీ దిలీప్ అన్నారు. ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ ఏవోఐ) తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభ సోమవారం ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్లో రాష్ట్ర అధ్యక్షులు లింగా ప్రభాకర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన దిలీప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లకు గడ్డుకాలమని, ఇప్పుడు ఐఆర్డీఏఐ ప్రవేశపెట్టిన ''డ్రాఫ్ట్ బీమా సగం'' ద్వారా ఎల్ఐసీ ఏజెంట్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నెల 9న ఐఆర్డీఏఐ ఎదుట చేపట్టిన ధర్నాను విజయవంతం చేసిన అందరికీ ఆల్ ఇండియా కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్. మంజునాథ్, పీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రక్రియను పోరాటాలతోనే ఎదుర్కొనగలమని తెలిపారు.
ఎల్ఐసీ కార్పొరేషన్‌కు బదులు కంపెనీగా మారే అవకాశం ఉన్నందున దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్నారు. మహాసభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర్లు, ఎల్ఐసీ ఏవోఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యాడ రామయ్య, జోనల్ ఉపాధ్యక్షులు నాగరత్నం, జోనల్ కోశాధికారి జీవీవీఎస్ఆర్కే చారి, ఆహ్వాన సంఘం నిర్వహకులు శ్రీను, మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు
నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఎల్ఐసీ ఏవోఐ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జె. వెంకటేశ్, అధ్యక్షులు ఎస్వీఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీ.నాగరత్నం, ప్రధాన కార్యదర్శిగా తన్నీర్కుమార్, కోశాధికారిగా కొత్తపల్లి రామనర్సయ్యతో పాటు 35 మంది కమిటీ సభ్యులు, 58 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.