Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంకల్ప ఆశీస్సుల యాత్ర విజయవంతం
నవతెలంగాణ-నంగునూరు
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని కోరుతూ చేపట్టిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంకల్ప ఆశీస్సుల యాత్ర విజయవంతమైంది. ఈ నెల 10వ తేదీ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సోమవారం నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు చేరుకుంది.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వినతిపత్రాన్ని స్వామివారి పాదాలు ముందు పెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పెద్ద మనసుతో, మానవతా దృక్పథంతో 2016లో జీవో నెంబర్ 16 ద్వారా క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. అనివార్య కారణాలవల్ల కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా కాంట్రాక్టు లెక్చర్లందరి క్రమబద్ధీకరణకు సీఎం పూనుకోవాలని కోరుతూ ఆయన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. మూడోరోజు పాదయాత్ర సిద్దిపేటలోని లక్ష్మీనరసింహ టెంపుల్ నుంచి నాంచార్‌పల్లి, వెల్కటూరు నుంచి నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటస్వామి దేవాలయం వరకు చేరింది. తెలంగాణ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జీ.ఉదయ భాస్కర్, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ లోడి, సిద్దిపేట యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవినాథ్ కోనాయిపల్లి వచ్చి సంకల్ప యాత్రకు ఆశీస్సులు అందజేశారు. సంకల్ప ఆశీస్సుల యాత్రకు సహకరించిన టీఎస్‌యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, ప్రెస్, మీడియా, ప్రభుత్వ అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో 475 అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ వి.శ్రీనివాస్, డాక్టర్ కాంపల్లి శంకర్, శోభన్‌బాబు, గంగాధర్, గోవర్ధన్, షాహినా, కృష్ణవేణి, కురుమూర్తి, దేవేందర్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, పాల్గొన్నారు.