Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు మూర్తి,నాగరాజు
- విద్యారంగ సమస్యలపై సమగ్ర చర్చ
- భవిష్యత్ పోరాటాలకు దిక్సూచి
- నూతన విద్యావిధానంతో అసమానతలు
- మోడీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం
- అందరికీ విద్య... అందరికీ ఉపాధి మా లక్ష్యం : నవతెలంగాణతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహాసభలు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వహించడం చారిత్రాత్మకమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం మహాసభలు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈనెల 13 నుంచి 16 వరకు జరిగే ఈ మహాసభల్లో విద్యార్థుల సమస్యలు, విద్యారంగంలో ఉన్న ఇబ్బందులు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర చర్చ జరుగుతుందన్నారు. భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభలు దిక్సూచిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)-2020తో అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ అవుతుందన్నారు. ఇంకోవైపు మోడీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. వాటి పరిరక్షణకు విద్యార్థిలోకం నడుం బిగించాల్సిన అవసరముందనీ, ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
విద్యా కాషాయీకరణే బీజేపీ లక్ష్యం :టి నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
దేశంలో మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతోపాటు రాజద్రోహం వంటి కేసులను నమోదు చేస్తున్నది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నది. ఇంకోవైపు నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని కాషాయీకరణ చేయాలని చూస్తున్నది. అందులో భాగంగానే మతతత్వ భావాలను పాఠ్యాంశాల్లో చేర్చుతున్నది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించడం లేదు. చరిత్రను వక్రీకరిస్తూ విద్యార్థులకు వాస్తవాలను అందించడం లేదు. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠ్యాంశాలను తొలగించి హెడ్గేవార్, వీర్‌సావర్కర్ వంటి వారి చరిత్రను విద్యార్థులకు అందిస్తున్నది. అందరికీ విద్య.. అందరికీ ఉపాధి కల్పించడం కోసం విద్యార్థులను ఐక్యం చేయడమే మా లక్ష్యం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. నూతన జాతీయ విద్యావిధానాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న మోడీ హామీని అమలు చేయాలి. వీటిపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.
ఎన్ఈపీపై కేసీఆర్ వైఖరి చెప్పాలి : ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిం చడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)పై ఆయన వైఖరిని స్పష్టం చేయాలి. రీసెర్చ్ స్కాలర్ల ఫెలోషిప్‌ల్లో 60 శాతం వరకు కేంద్రం కోత విధించింది. రాష్ట్రంలోని స్కాలర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్లను అందించాలి. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులివ్వాలి. ప్రభుత్వ విద్యాసంస్థలు, వర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. ఓయూలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు జరగడం చారిత్రాత్మకం. రాజకీయాలను చర్చించే నిలయం ఓయూ. ఇక్కడ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన నాపై గతంలో భౌతికదాడికి ప్రయత్నం జరిగింది. దాన్ని విద్యార్థులంతా ఐక్యంగా తిప్పికొట్టారు. విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందన్న నమ్మకాన్ని కలిగించాం. రాహుల్‌గాంధీతోపాటు ఎవరికైనా ఓయూలో సభలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నదే మా అభిప్రాయం. ఉస్మానియా అంటేనే ఉద్యమాల గడ్డ. ఆంక్షలు విధించడం సరైంది కాదు. ఎస్ఎఫ్ఐ మహాసభలకు విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులతోపాటు ఇతర విద్యార్థి సంఘాల నుంచి విశేష స్పందన వస్తున్నది. మోడీ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ధ్వంసమవుతున్నాయి. దేశంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడమే మా కర్తవ్యం. ఆ దిశగా మహాసభల్లో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం.