Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల పట్ల మను ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తున్న బీజేపీ
- 'అవరోధాలను అధిగమిద్దాం : సమసమాజాన్ని నిర్మిద్దాం' సెమినార్లో ఎస్ పుణ్యవతి
- పాలకుల విధానాల ఫలితమే స్త్రీలపై దాడులు : మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హింస లేని సమాజం కోసం పోరాడక తప్పదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన 'అవరోధాలను అదిగమిద్దాం-సమసమాజాన్ని నిర్మిద్దాం' అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ ఆధునిక కాలం అని చెప్పబడుతున్న నేటి సమాజంలో మహిళలపై దేశంలో రోజూ ఒక చోట లైంగిక వేధింపులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీని విలాస వస్తువుగా చూసే దుస్థితి నెలకొందన్నారు. మను ధర్మశాస్త్రం స్త్రీలకు ఎలాంటి స్థానం కల్పించిందో, వారి పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉందో..నేటికి అవే విధానాలు వారి పట్ల కొనసాగుతున్నాయని చెప్పారు. పురుషాధిక్యతా సమాజం మహిళనెప్పుడూ బానిసగానే చూస్తదని తెలిపారు. వారిని రెండో తరగతి పౌరులుగా చూపించేందుకు పుక్కిటి పురాణ గాథలను రకరకాల రూపంలో వివరిస్తారని చెప్పారు. సనాతన ధర్మాలను ప్రవచించే పండితులు, పురుషాధిక్య భావాజాలకులు స్త్రీలపై నోటి దురుసుతనాన్ని చూపిస్తున్నారన్నారు. సమాజ పురోగమనానికి ఆటంకంగా ఉన్న మనుధర్మశాస్త్రాన్ని బీఆర్ అంబేద్కర్ నాడు తగుల బెట్టారని గుర్తుచేశారు. ఆ చర్య ఈ కాలంలో జరిగితే ఆయన్ను బీజేపీ పాలకులు జైల్లో పెట్టేవారని చెప్పారు. బ్రహ్మ నాలుగు వర్ణాలను పుట్టిస్తే..అందులో పాదాలనుంచి పుట్టిన శూద్రజాతిపై మూడు వర్ణాలకు సేవచేయాలని ఆ శాస్త్రం ప్రభోదించిందని తెలిపారు. నిజమైన సంపదన సృష్టించే వారంతా కుల, గోత్ర, నీతి, నిజాయితీ లేనోళ్లుగా ముద్ర వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణులు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా కనిస్తున్నాయని చెప్పారు. వీటికి వ్యతిరేకంగా పోరాడటమంటే..కుల, మత తారతమ్యాలు లేకుండా పోరాడటమేనని చెప్పారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి మలు ్ల లక్ష్మి మాట్లాడుతూ మహిళలకు స్వతంత్య్రం, సమానత్వం పేపర్లోనే కనిపిస్తున్నాయని చెప్పారు. రోజురోజుకు భద్రత కరవుతున్నదన్నారు. బడికి పోయిన పాప తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లి ఆందోళనతో ఎదురు చూడాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొన్నదని చెప్పారు. ఎల్కేజీ చదువుతున్న చిన్నారి నుంచి పండు ముదుసలిపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. వీటిపై పండితులైన గరికపాటి లాంటి వారు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. పైగా అంహకార పూరిత వ్యాఖ్యానాలు చేసి వార్తల్లో వ్యక్తులుగా ఉంటున్నారన్నారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని చెప్పారు. అయినా ప్రజా ప్రతినిధులెవ్వరూ ఇది తప్పని చెప్పక పోవటం బాధగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. దేశం విద్యా, వైద్యం తదితర రంగాల్లో పొరుగు దేశాలకంటే వెనుకబడి ఉన్నా..స్త్రీలపై దాడుల్లో ముందున్నామని చెప్పారు. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు చేపట్టడం తప్ప మూలాల్లోకి వెళ్లడం లేదని విమర్శించారు. టీవీల్లో వస్తున్న బహుభార్యల సీరియళ్లు గహ హింస పెరగడానికి తావిస్తున్నాయన్నారు. మరోపక్క మహిళలు బయటకు రాకూడదని, దుస్తులు సరిగ్గా వేసుకోకపోవడం వల్లే ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయిని మనువాద భావజాలం కలిగిన బీజేపీి కేంద్రమంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. 'భారతమాతకు జై' అన్నవారే స్త్రీలను కించపరచడం దాని రెండు నాలుకల ధోరణికి అద్దం పడుతున్నదన్నారు. బీజేపీి పాలిత రాష్ట్రాలు హింసలో మొదటి వరసలో వున్నాయని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతి గంటకు దేశ వ్యాప్తంగా నలుగురి మహిళలపై లైంగిక దాడులు, ప్రతి పది నిమిషాలకు ఒక కిడ్నాప్ జరుగుతున్నదని వివరించారు. ఉన్న మహిళా రక్షణ చట్టాల ను తగిన రీతిలో అమలు చేయకుండా నీరుకారుస్తున్నారని తెలిపారు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరిగి రాస్తుందన్న గురజాడ మాటలు నిజం కావా లనీ, మహిళలు, విద్యార్థులు, మేధావులు, అభ్యుదయవాదులు కలసికట్టుగా హింస లేని సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. జస్టిస్ వర్మ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్లలో వస్తున్న విష సంస్కతిని, పోర్న్ చిత్రాలను నిషేధించా లన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి, బుగ్గవీటి సరళ, కెఎన్ ఆశా లత, ఇందిరా, పాలడుగు ప్రభావతి, భారతి, శశికళ పాల్గొన్నారు.