Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్, బీజేపీ తిరోగమన విధానాలను అడ్డుకోవాలి
- హిందూ రాష్ట్ర నినాదం దేశ విచ్ఛిన్నానికి పునాది
- సంపన్నుల పాలిట మోడీ సర్కారు కల్పతరువు
- పేదలను విద్యకు దూరం చేసేందుకే నూతన విద్యావిధానం
- జాతీయోద్యమం తరహాలో ఉద్యమాలు
- విద్యార్థుల సమస్యలపై పోరాటమే కాదు...నిరుపేదల హక్కుల కోసమూ నిలబడాలి : ఎస్ఎఫ్ఐ బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పిలుపు
"కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నది. దాన్ని అడ్డకునేందుకు శంఖారావం పూరించాలి. దేశాన్ని కాపాడేందుకు లౌకిక శక్తులు ముందుకురావాలి."
- త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
హైదరాబాద్‌లో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శంఖారావాన్ని పూరించాలని మాణిక్ సర్కార్ అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయోద్యమం తరహాలో ఉద్యమించి, ఆ విధానాలను తిప్పికొట్టాలని చెప్పారు. కుల, మతం పేరిట దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ హిందూ రాష్ట్ర నినాదం దేశ విచ్ఛినానికి దారి తీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేసేందుకు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, నిరుపేదలకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను పెంచి పోషించేలా ఉందని తీసుకుంటున్నదని చెప్పారు. విద్యార్థులు విద్యారంగ సమస్యలపై పోరాడడమే కాకుండా నిరుపేదల హక్కుల కోసం కూడా నిలడాలని కోరారు. ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు వి.పి సాను అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ మాట్లాడారు. దేశంలో విద్యారంగం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నమైన, హానికరమైన నియంతృత్వ విధానాలతో బీజేపీ సర్కారు ముందుకు పోతున్నదన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక పథకం ప్రకారం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. ఆయా విధానాలు సంపన్నులు, కార్పొరేట్లకు అనూకూలంగానూ, నిరుపేదలకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పారు.
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే నూతన విద్యావిధానం
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మోడీ సర్కారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని మాణిక్ సర్కార్ ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తూట్లు పోడుస్తున్నదని చెప్పారు. ఇవన్నీ కూడా బీజేపీకి తెలియకుండానో, యాధృచ్ఛింగానో జరగడం లేదనీ, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ద్వారా కార్పొరేట్లకు లాభాల పంట పండిస్తున్నదని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, పేదలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు విద్యకు పూర్తిగా దూరమవుతారని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలు, సిలబస్, విద్యాబోధనను సైతం కేంద్రం నియంత్రిస్తున్నదని విమర్శించారు. శాస్త్రీయ విద్య, వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన విద్యా విధానం...మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కుల, మత విద్వేషాలు తప్ప... విద్యార్థుల్లో సేవా గుణం, ధీనులకు తోడ్పడే విధంగా లేదన్నారు. కలుషితమైన విద్యతో ప్రజల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య దీపికలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో వినాశనకరమైన అంశాలను జొప్పిస్తున్నాయని తెలిపారు. విద్యరంగంలో మౌలిక సదుపాయాల కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం ఉద్యమించేలా కార్యాచరణ చేపట్టాలని విద్యార్థి లోకాన్ని ఆయన కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులు, ఫెడరలిజం, సామ్యవాదం వంటి దేశ వారసత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తున్నదని విమర్శించారు.
నిరంతరాయంగా పెరుగుతున్న నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం నిరంతరాయంగా పెరుగుతున్నదని మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారనీ, ఆ లెక్క ప్రకారం 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా కనిపిస్తున్నా...వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. దీంతో అనేక మంది ఇంజనీరింగ్, డాక్టర్ వంటి చదువులు చదివినప్పటికీ గ్రూప్ 4 ఉద్యోగాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఉద్యోగాలకు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. చివరకు అగ్నిపథ్ పేరుతో సైన్యంలోనూ తాత్కాలిక ఉద్యోగాలు నింపుతున్నారని చెప్పారు. దేశం కోసం పోరాడాల్సిన వారిని కూడా కాంట్రాక్టు పద్దతిలో నింపుతున్నారంటే, వారికి దేశ భక్తి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు.
ప్రమాదపుటంచుల్లో ప్రజలు
బీజేపీ పాలనలో ప్రజలు ప్రమాదపుటంచుల్లో పడ్డారని ఆయన చెప్పారు. రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు ఏడాది కాలంపాటు ఢిల్లో పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మోడీ సర్కారు రైతులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేత, గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, కార్మికుల హక్కులను కాలరాయడం, పోరాడి సాధించుకున్న 42 కార్మిక హక్కులను హరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కార్పొరేట్లు, సంపన్నుల కొమ్ముకాస్తూ...కార్మికుల హక్కులను అణిచివేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థలను బీజేపీ సర్కారు తమ గుప్పిట్లో పెట్టుకుందని తెలిపారు.
పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ
దేశంలో ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవస్థ సైతం క్షేమంగా లేదనీ, అధికార బీజేపీ ప్రతిపక్షాలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నదని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఒకే జాతి, ఒకే మతం పేరుతో హిందూ రాష్ట్రం ఏర్పాటుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు తరహా విధానాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీ సిద్ధాంతాన్ని ఓడించేందుకు ఎస్ఎఫ్ఐ సమర శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్న కేంద్రంలోని ఫాసిస్టు తరహా బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు స్కాలర్షిప్స్ నిలిపివేసిందన్నారు. హాస్టల్స్ కూడా మూసివేసిందని విమర్శించారు. మహాసభలకు రాకుండా గుజరాత్ రాష్ట్ర విద్యార్ధి నాయకులను అక్కడి బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. విద్యార్ధి అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ నడుంబిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోషలిజం కోసం ఎస్ఎఫ్ఐ పని చేస్తుందని ఎస్ఎఫ్ఐ జాతీయ గర్ల్స్ కన్వీనర్ థీప్సితా ధర్ చెప్పారు. పదేండ్ల వయస్సులోనే మల్లు స్వరాజ్యం నిజాం దొరకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారనీ, ఆమె స్ఫూర్తితో విద్యార్ధులందరూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన ఎస్ఎఫ్ఐ నేత ధీరజ్ అమరజ్యోతిని తండ్రి రాజేంద్రన్‌కు నేతలు ఈ సందర్భంగా అందించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు. సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు దీనిత్ డెంటా, నితిస్ నారాయణ్, సచిన్‌దేవ్, వినీష్, మరియప్పన్, జేఎన్‌యూ అధ్యక్షులు ఐషీ ఘోష్, బంగ్లాదేశ్ విద్యార్థినేత దీపక్ సింగ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న, అశోక్, అనుశ్రీ, పూజా అభిషేక్‌నందన్ తదితరులు ఉన్నారు.