Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషలిజం వర్ధిల్లాలి.. ఎస్ఎఫ్ఐ జిందాబాద్
- సాగరతీరాన విద్యార్థి నినాద కెరటాలు
- ప్రత్యేక ఆకర్షణగా అమ్మాయిల నాట్యాలు
- ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభ ప్రారంభం సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అప్ అప్ సోషలిజం.. డౌన్ డౌన్ క్యాపిటలిజం.. సోషలిజం వర్ధిల్లాలి.. ఎస్ఎఫ్ఐ జిందాబాద్ నినాదాలతో సాగర తీరం చెంత విద్యార్థి లోకం నినదించింది. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) 17వ జాతీయ మహాసభ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకు దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, యూపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రారంభించారు. విప్లవ వీరులు చేగువేరా, భగత్ సింగ్ జెండాలు, ఎస్ఎఫ్ఐ బ్యానర్లతో నెక్లెస్ రోడ్ ఉద్యమ స్ఫూర్తిని నింపుకుంది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలు రాసివున్న జెండాలు రెపరెప లాడాయి. అమరులకు లాల్ సలామ్.. ఇంక్విలాబ్ జిందాబాద్.. సోషలిజం సాధిస్తాం.. మతోన్మాదం అంతం చేస్తామంటూ విద్యార్థి లోకం నినదించింది. 'వీ వాంట్ న్యూ ఇండియా, రెవెల్యూషన్ ఫర్ సోషలిజం.. సోషలిజం ఫర్ ఎస్ఎఫ్ఐ.. ముక్త కంఠంతో ఎలుగెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అదిగదిగో ఎస్ఎఫ్ఐ.. అంటూ పాటలు ఆలపిస్తూ.. స్థానిక విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. 'కులం కుల్లురా..మతం మత్తురా..' చదువుతో పోరాడు.. చదువుతూ పోరాడు అంటూ విద్యార్థులు పాడిన పాటలు ఆలోచన రేకెత్తించాయి. ప్రజానాట్యమండలి డప్పు దరువులు విద్యార్థుల ఆట పాటలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. 'విశాల భారతమంతటా.. ఎస్ఎఫ్ఐ విజయ బావుటా..' అంటూ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ లక్ష్యాలను నినదిస్తూ బహిరంగ సభ జరిగే పీపుల్స్ ప్లాజా వరకు భారీగా ర్యాలీ సాగింది.