Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే గుజరాత్లో గెలుపు
- ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీలను భయపెడుతున్నారు
- బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -రామన్నపేట
బీజేపీని నిలువరించడానికి ఏ శక్తులు కలిసి వస్తాయో ఆ శక్తులు, ప్రతిపక్ష పార్టీలు ఏకీకృతమై ముందుకు సాగాల్సిన అవసరముందని సీపీిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని అమృత వనం రిసార్ట్స్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లా డారు. బీజేపీ సైద్దాంతిక సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. బీజేపీ సిద్ధాంతకర్తలైన హెగ్డే వార్, సావర్కర్ చెప్పిన సిద్ధాంతాలను ప్రజలకు వివరిం చాలన్నారు. వచ్చే జనవరి నుంచి బీజేపీని సైద్దాంతికంగా ఎండగడ్తామని చెప్పారు. మూడు అంశాలపై ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. భారతదేశానికి మనుధర్మశాస్త్రమే రాజ్యాంగంగా ఉపయోగపడుతుందని బీజేపీ వారి సైద్దాంతిక సిద్ధాంతం అని విమర్శించారు. రాష్ట్రాలపై పెత్తనం చేయడం, హక్కులను కాలరాయడం, సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం బీజేపీ విధానమని విమర్శించారు. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీల నాయకుల, ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆ విధంగా వారిని లొంగదీసుకుని బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిం చారు. అవినీతికి పాల్పడిన వారిపై దాడులు చేయడంలో తమకేమీ అభ్యంతరం లేదని, కానీ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు నీతిమంతులు ఏం కాదని.. వారిని వదిలేసి కేవలం ప్రతిపక్షాల వారిపైనే ఈడీ, ఐటీ దాడులు చేయడం పూర్తిగా పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే అత్యధిక అసెంబ్లీ సీట్లు గెలుపొందడం వెనుక ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు, గుజరాతి ఆత్మగౌరవం పేరుతో రెచ్చగొట్టే పనులు చేశారన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలనపై వ్యతిరేకత కనిపించిందని, ప్రజలు సమస్యలపై చర్చించుకున్నారని దాని ఫలితంగానే అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. బీజేపీ ఎక్కువ కాలం పరిపాలనలో ఉంటే పరిస్థితులు భయంకరంగా మారుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఫ్రంట్లకు వ్యతిరేకమని, ఎన్నికల ముందు కాకుండా ఎన్నికల తర్వాత వచ్చిన సీట్లను బట్టి ఫ్రంట్ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా తప్పులను ఎత్తి చూపుతామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేలా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, ఖాళీ జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇంటి స్థలం ఉన్నప్పటికీ పట్టాలు లేవని, అలాంటి వారికి ఆ స్థలానికి పట్టా ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. పోడు భూముల సర్వే సక్రమంగా జరపాలన్నారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, వీఆర్ఏలు, గ్రామపంచాయతీ ఉద్యోగుల, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2008, 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 119 సీట్లలో కొన్నింటిలో మాత్రమే బీజేపీ పోటీ ఉండవచ్చన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.