Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఆర్డీఏ బిల్లుకు వ్యతిరేకంగా ఎల్ఐసీ ఏజెంట్లు ఐక్యంగా ఉద్యమించాలని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ ఏఓఐ) రాష్ట్ర గౌరవ సలహాదారు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మన్హోత్రా కమిటీ సూచనల మేరకు 1999లో ఐఆర్డీఏ చట్టం తీసుకొచ్చి ఐఆర్డీఏని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. 2000 సంవత్సరం ఆగస్టు నుంచి ప్రయివేటు కంపెనీలు బీమా వ్యాపారం చేసేందుకు అనుమతించిందనీ, దాన్ని బీజేపీ ప్రభుత్వం 24 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నుంచి 74 శాతానికి పెంచిందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో 23 ప్రయివేటు జీవిత బీమా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయనీ, దీంతో 1956 ఇన్సూరెన్స్ జాతీయీకరణ లక్ష్యమే నిర్వీర్యమైపోయిందని చెప్పారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసీ వెన్నుముకగా నిలిచిందని తెలిపారు. బిల్లుతో రాష్ట్రంలోని 50 వేల మంది ఎల్ఐసీ ఏజెంట్ల భవిష్యత్తు రోడ్డున పడనుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, ఏఐకెఎస్, ఏఐఏడబ్ల్యుయు సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున నిర్వహించనున్న చలో పార్లమెంటుకు వేలాదిగా తరలిరావాలని ఎల్ఐస ఏఓఐ గౌరవాధ్యక్షులు జె.వెంకటేష్ పిలుపునిచ్చారు.