Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా వారిలోని సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రం ప్రకాశ్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాల వేదికగా జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భవిష్యత్‌లో కొత్తదనంతో ప్రయోగాలను ప్రదర్శించడానికి ఇది మంచి వేదిక అని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలకు విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించాలని, సైన్స్, గణితం విషయాలకు సంబంధించిన ప్రయోగాలతో వారికి కావాల్సిన సలహాలు అందిస్తే వారి నైపుణ్యాన్ని మరింత పదును పెట్టి మంచి ఆలోచనలకు పునాదులు వేస్తారన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన సుమారు 478 ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ వీపీ. గౌతమ్, జడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్, సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, డీఈఓ, యంఈఓలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.