Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎంఓపీఎస్ నేతలకు సీఎం కేసీఆర్ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌ఎంవోపీఎస్ నేతలకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలో కేసీఆర్‌ను నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ కలిశారు. రాష్ట్రంలో 2004 నుంచి నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1.70 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు దేశ వ్యాప్తంగా ఉన్న 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక భద్రత లేకుండా ఉన్న సీపీఎస్‌ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇటీవల జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సిక్కిం క్రాంతి కారి మోర్చా, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌ఘడ్ వంటి పార్టీలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించా యని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా సీపీఎస్ విధానాన్ని అధ్యయనం చేసి పాత పెన్షన్ విధానం అమలుపై పార్టీ పరంగా విధాన నిర్ణయం తీసుకునేలా పరిశీలిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.