Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో జూలకంటి పిలుపు
నవతెలంగాణ-కట్టంగూరు
నాటి వీర తెలంగాణ పోరాట యోధులు, అమరుల స్ఫూర్తితో మళ్లీ కూలి, భూమి పోరాటాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధమవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంనగర్ వైవీఆర్ ఫంక్షన్హాల్లో సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 19వ మహాసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ నూటికి 80 శాతం ఉన్న పేదలకు నిలువ నీడ లేని దుస్థితి ఉందన్నారు. పాలకుల విధానాలే ఈ దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. బురద నుంచి బువ్వ తీస్తున్న వ్యవసాయ కూలీలకు కూడు, గూడు, గుడ్డ, విద్యావైద్యం అందని ద్రాక్షలా తయారయ్యాయని అన్నారు. అందుకు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. హక్కుల కోసం రైతులు, కూలీలు ఐక్యఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా.. వామపక్షాల ఒత్తిడితో 2005లో ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల వలసల నివారణ జరిగిందన్నారు. పేదలకు కూలి రేట్లు పెరిగాయని, వారిలో చైతన్యం ఈ చట్టం ద్వారానే వచ్చిందని చెప్పారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్పరం చేసి యువతకు ఉపాధి లేకుండా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టం నిధులను ఈ ఏడాది రూ. లక్ష కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు కుదించడం దారుణమన్నారు. రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపిన మోడీ ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించాలన్నారు. 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కనీస వేతనం జీవోను నేటికీ సవరించలేదన్నారు. రెండేండ్లకోసారి పెరుగుతున్న నిత్యావసరాల ధరలకనుగుణంగా కూలి రేట్ల జీఓను మార్చాల్సి ఉండగా, 9 ఏండ్లవుతున్నా ఎలాంటి మార్పులకు నోచుకోలేదన్నారు. అంతకుముందు తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొజ్జ చినవెంకులు, నారి ఐలయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, వ్యకాస జిల్లా నాయకులు దండెంపల్లి సరోజ, కత్తుల లింగస్వామి, చింతపల్లి బయ్యన్న, లూర్దు మారయ్య, రవినాయక్, పిల్లుట్ల సైదులు, చెరుకు పెద్దులు, వంటెపాక సైదులు, మన్నె భిక్షం, ఆకుల వెంకట్రాములు, ఇటికాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.