Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 33 జిల్లాల నుంచి 700 మంది ప్రతినిధులు, పరిశీలకులు
- సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు హేమలత, తపన్‌సేన్ హాజరు
- 23న జరిగే బహిరంగ సభకు కేరళ కార్మిక మంత్రి శివన్కుట్టి రాక
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు సిద్దిపేట పట్టణం ముస్తాబైంది. ఈ నెల 21, 22, 23 తేదీల్లో సిద్దిపేట పట్టణంలో తొలిసారిగా జరుగనున్న సీఐటీయూ రాష్ట్ర 4వ మహాసభలకు ఆహ్వాన సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. రెడ్డి సంక్షేమ సంఘంలో మూడు రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభకు మల్లు స్వరాజ్యం నగర్‌గా, ప్రభుత డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రాంగణంగా నామకరణం చేశారు. మహాసభలకు 33 జిల్లాల నుంచి లక్షలాది సభ్యత్వం కల్గిన కార్మికులకు ప్రతినిధులుగా 700 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్నారు. మహాసభల ప్రారంభ సభకు సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, ఉపాధ్యక్షులు సాయిబాబు హాజరవుతారు. ఉదయం 10 గంటలకు సీఐటీయూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. ప్రతినిధుల సభల్ని జాతీయ నాయకులు ప్రారంభిస్తారు. మహాసభలకు ఎంపీ, సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు, టీఎన్జీఓ రాష్ట్ర నాయకులు, ఇతర ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని సౌహార్ధ సందేశాలివ్వనున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, గోపాలస్వామి, ఉపాధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి, ఎల్లయ్య ఇతర బాధ్యులు మహాసభల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం నెల రోజులుగా సిద్దిపేట పట్టణంలో గోడరాతలు, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, ప్లెక్సీలు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. వివిద జిల్లాల నుంచి మహాసభల్లో పాల్గొననున్న ప్రతినిధుల కోసం స్థానిక శివమ్స్ ఫంక్షన్ హాల్లో వసతుల కోసం ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, సీఐటీయూ తోరణాలు, జెండాలతో అలంకరించారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, గ్రామ పంచాయతీ, వివిద కంపెనీల యూనియన్లు, ట్రాన్స్పోర్ట్, హమాలీ, బీడీ కార్మిక సంఘాలు మహాసభల జయప్రదం కోసం హర్నిశలు కృషి చేస్తున్నాయి.
23న బహిరంగ సభ
మహాసభల సందర్భంగా ఈ నెల 23న స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముందుగా పట్టణంలోని హైస్కూల్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బహిరంగ సభాస్థలి వరకు కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాల్లోని కార్మికవర్గం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా తరలిరానున్నారు. ఈ బహిరంగ సభకు కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్కుట్టి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.