Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల కార్మికవర్గంతో పాటు ప్రజలకు సమస్యలు పెరిగాయని, పాలకుల తీరును ఎండగడుతూ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభలో ఈ మేరకు 'ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి' అంటూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. కార్మికులపై పనిభారం బాగా పెరిగిందని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్లోర్లెవల్ కనీస వేతనంగా రూ.4,678 నిర్ణయించడాన్ని బట్టే మోడీ ప్రభుత్వం కార్మికులపై కక్షపూరిత వ్యవహరిస్తున్నదనేది అర్ధం అవుతున్నదన్నారు. దీన్ని సాకుగా చూపెట్టి యాజమాన్యాలు కార్మికుల వేతనాల్లో కోతపెడుతున్నాయని, కేంద్రం చెప్పేదానికంటే తాము ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నాయని చెప్పారు. మరోపక్క పెరుగుతున్న ధరల భారం విద్యా, వైద్యం ఖర్చులు రెట్టింపు అవ్వడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. మూడు షిప్టుల స్థానంలో రెండు షిప్టుల పనివిధానం వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక, వలస కార్మికుల మధ్య తగువుపెట్టి కార్మిక ఐక్యతను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. బీజేపీ వచ్చాక ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి చీల్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇది కార్మిక వర్గ ఐక్యతను కూడా దెబ్బతీస్తున్నదన్నారు. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి..ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేటాయించాలి
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాగుల రమేశ్
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చొరవ తీసుకోవాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడటం తగదన్నారు. దీన్ని బట్టే రాష్ట్రం పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతున్నదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. అట్లాగే గిరిజన యూనివర్సీటీ ఏర్పాటు హామీని కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. ఈ తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.