Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర సర్కారు చొరవ తీసుకోవాలి
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
- సింగరేణి బకాయిలను ఇవ్వాలి
- స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి
- బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, ఎస్వీ రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలనీ, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, ఎస్వీ.రమ హెచ్చరించారు. గురువారం సిద్దిపేటలోని మల్లుస్వరాజ్యంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో విలేకర్లతో భూపాల్ మాట్లాడుతూ.. సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభ ఆమోదించిన పలు తీర్మానాలను వివరించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, హార్టీకల్చర్ యూనివర్సిటీ, తదితర విభజన హామీలపై నెరవేర్చేదాకా సీఐటీయూగా పోరాటం చేస్తామని చెప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే స్థానికంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి 90 వేల కోట్లు కేటాయిస్తే మైనింగ్ ప్రక్రియ ప్రారంభించవచ్చుననీ, దీనివల్ల ఏడెనిమిది జిల్లాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ రెండింటి ద్వారా రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్టీపీసీ ద్వారా నాలుగువేల మెగావాట్ల విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు హామీనీ గాలికొదిలేసిందని విమర్శించారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను అణచివేసిందన్నారు. వేల్ఫేర్పేరుతో వేసిన కమిటీలన్నీ నిర్వీర్యంగా మారాయన్నారు. 2017, 2021 పేస్కేల్లను అమలు చేయాలనీ, సీసీఎస్, పీఎఫ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంస్థకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపోల మూసివేతను ఆపేసి కొత్త బస్సులను సంస్థకు ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమేమో ప్రయివేటు కంపెనీలకు బొగ్గుగనులను లీజుకిస్తూ పోతున్నదనీ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోవడం లేదని చెప్పారు. సింగరేణి కార్మికులకు చెల్లించాలని బకాయిలను, స్టేట్ పవర్ కార్పొరేషన్‌కు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని కోరారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. సామాజిక అసమానతలను తగ్గించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం పెద్దగా ఖర్చుపెట్టడం లేదని చెప్పారు.
ఎస్వీరమ మాట్లాడుతూ..స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన జీవోలను సవరించాలనీ, కార్మికుల కనీస వేతనం రూ.26వేలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న మూడున్నర లక్షల స్కీమ్ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరిగాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు నిధులను తగ్గిస్తూ వాటిని ప్రయివేటు శక్తులకు కట్టబెట్టే కుట్రకు పూనుకుంటున్న తీరును వివరించారు. స్కీంవర్కర్లపై రాజకీయ, మానసిక ఒత్తిళ్లను, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లందరికీ రిటైర్డ్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. రాష్ట్రంలో బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ కార్యదర్శి గోపాలస్వామి, అధ్యక్షులు ఎల్లయ్య, సహాయ కార్యదర్శి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.