Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2011 జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కుట్ర
- కమ్యూనిస్టులు ముందుండి పోరాడాలి
- హిందువులకు ఒకే దేవుడు ఉండాలని చెప్తారా? : బీజేపీ నేతలకు కె నాగేశ్వర్ సవాల్
- మోడీ సర్కారు ఫాసిస్టు పాలనను అంతమొందించాలి : సురవరం
- ఘనంగా సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాఖ్య వ్యవస్థపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ విమర్శించారు. దీంతో దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై కేంద్రం బహుముఖ దాడి చేస్తున్నదని అన్నారు. కమ్యూనిస్టులు ముందుండి పోరాడటం ద్వారా కేంద్రం అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమ వారం ఘనంగా నిర్వమించారు. అంతకుముందు హిమాయ త్‌నగర్‌లో ఉన్న సీపీఐ నగర కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో 'రాజ్యాంగ రక్షణ- ఫెడరలిజం పరిరక్షణ'అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడుతూ పీడిత ప్రజలున్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుంద న్నారు. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడే కార్మికులు, ఉద్యోగులు వాటిని అమలు చేసే పార్టీలకే ఓటేస్తున్నారని చెప్పారు. హక్కుల కోసం జరిగే పోరాటాల తోపాటు సైద్ధాంతిక భావజాలంలోనూ మార్పు రావాలని సూచించారు. రాజ్యాంగంపై బీజేపీ సైద్ధాంతిక దాడి చేస్తున్నదని విమర్శిం చారు. కేంద్ర హోంమంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నపుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పీఠికలో లౌకిక అనే పదం లేదనీ, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని చేర్చారంటూ చెప్పారని వివరించారు. లౌకిక అనే పదం అవసరం లేదన్న అభిప్రాయాన్ని సంఫ్‌ుపరివార్ శక్తులు కోట్ల మందిలోకి తీసుకెళ్లాయని అన్నారు. అయితే రాజ్యాంగం లౌకిక స్వభావాన్ని కలిగి ఉందంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానిం చిందని గుర్తు చేశారు.
మోడీ, షా తెలుగులో మాట్లాడాలి
భారతీయులంతా హిందీ నేర్చుకోవాలంటూ కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్తున్నారని నాగేశ్వర్ గుర్తు చేశారు. అందరికీ హిందీ భాష ఆత్మవంటిదంటున్నారనీ, అలాంట పుడు తెలుగు ప్రేతాత్మ అవుతుందా?అని ప్రశ్నించారు. రాజ్యానికి మతమే లేదంటూ రాజ్యాంగం చెప్తుంటే హిందూ రాజ్యం తేవాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. దేశంలో ఒకే భాష, ఒకే మతం ఉండాలంటున్నారని చెప్పారు. అది తెలుగు భాష ఎందుకు కాకూడదని అన్నారు. మోడీ, అమిత్‌షా తెలుగులో మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, భావాల సమామారమే భారతీయత అని వివరించారు. హిందువులందరికీ ఒకే దేవుడు ఉండాలంటూ చెప్తారా?అని బీజేపీ నాయకులకు నాగేశ్వర్ సవాల్ విసిరారు. దేశంలో 33 కోట్ల మంది దేవుళ్లున్నారనీ, ఎవరి ఆరాధన వారిదనీ, ఎవరి సంస్కృతి, సంప్రదాయం వారి కుంటుందని అన్నారు. యూనియన్ గవర్నమెంట్ అనే పదాన్నే వాడాలని కోరారు. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయం, సహకారరంగం, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్, విద్యారంగంపైనా కేంద్రం చట్టాలు చేసిందన్నారు. రాజ్యాంగంలో గవర్నర్‌కు అధికారాలు, బాధ్యతలు ఏమీ లేవని చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలు ఎన్నుకున్న సీఎంను విమర్శిస్తారని చెప్పారు. కేరళ గవర్నర్ ఓ అడుగు ముందుకేసి ఓ మంత్రి విశ్వాసం లేనందున తొలగించాలంటూ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. ఆ మంత్రిపై తనకు విశ్వాసముం దంటూ కేరళ సీఎం సమాధానమిచ్చారని అన్నారు. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగేలా జీఎస్టీని కేంద్రం తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రాలకు 41 శాతం నిధులిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నదని అన్నారు. కేవలం 21 శాతం నిధులే వస్తున్నాయని చెప్పారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారు. కానీ కేంద్రం కుట్ర చేసి 2011 జనాభా లెక్కల ఆధారంగా చేయాలని భావిస్తున్నదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాద ముందని చెప్పారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాజ్యాంగాన్ని, సమాఖ్య స్ఫూర్తిని రక్షించుకోవాలని కోరారు.
నిరంతరం ప్రజాపోరాటాలను నిర్మించాలి : సురవరం
దేశంలో మోడీ సర్కారు ఫాసిస్టు పాలనను కొనసాగిస్తున్నదని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఐక్యంగా పోరాడి ఆ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల పునరేకీకరణ జరగాలన్నారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. విశాల ప్రాతిపదికన వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలు ఐక్యం కావాలని చెప్పారు. ఈ విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహదపడుతుందన్నారు. ప్రజా సమస్యలపై కొత్త పోరాటాలకు రూపకల్పన చేయాలనీ, ఆ దిశగా ప్రతిన బూనాలని ఆయన పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజాపోరాటాలను నిర్మించాలని సూచించారు. ప్రజల కోసం నిర్వహించే పోరాటానికి చారిత్రక బాధ్యత ఉన్నదన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదన్నారు. అది త్యాగం అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజా గొంతుకగా, నూతన తరహా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. కమ్యూనిస్టుల పునరేకీరణ జరగాలంటూ పేదలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థలో ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి పాత్ర పెరిగిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్, ఈటి నర్సింహా, మాజీ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి డిజి సాయిలుగౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అమర వీరుల ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతా ప్రెడ్డి, స్వాతంత్య్ర సమరయోధులు ఏటుకూరి కృష్ణమూర్తి, ఐఎస్ రాజు, సుదీర్ఘ కాలం సీపీఐ కార్యాలయ కార్యదర్శిగా పని చేసిన డిఎస్ రాంచందర్‌రావు, చెన్నయ్య, చెన్నమనేని వెంకటేశ్వర్రావును శాలువాతో సన్మానించారు.