Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వేల గుడిసెలు వేయించిన వ్యవసాయ కార్మిక సంఘం
- చాలాచోట్ల గుడిసెవాసులపై సర్కారు దాష్టీకం
- పోలీసులు దాడులు చేస్తున్నా వెనక్కి తగ్గని పేదలు
- 10.5 లక్షల ఎకరాల మిగులు భూమిని పంచాలనే డిమాండ్ తెరపైకి
- భూకబ్జాదారుల వివరాలను ఎత్తిచూపుతున్న వ్యకాస
- అయినా వాటిని స్వాధీనం చేసుకోని సర్కారు..కబ్జాదారులకే వత్తాసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం అవుతున్నాయి. సర్కారుకు 40 లక్షల దరఖాస్తులు అందాయంటేనే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్ధమవుతున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 20వేలకుపైగా గుడిసెలను పేదలు వేసుకున్నారు. ఎన్ని బెదిరింపులు వస్తున్నా... పోలీసులు లాఠీచార్జీలు చేస్తున్నా... పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నా...వారు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. చాలా చోట్ల దాడులుచేసి గుడిసెలను తగులబెట్టినా..మళ్లీ అక్కడే తిరిగి వేసుకుంటున్నారు తప్ప భయపడటం లేదు. బతికేందుకు గూడు ఇచ్చేదాకా పోరాటం విరమించబోమంటూ పేదలు కంకణబద్దులై ముందుకుసాగుతున్నారు. దీనికితోడు రాష్ట్రంలోని 10.5 లక్షల ఎకరాల మిగులు భూమిని పేదలకు పంచాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం గదా ఇక ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటమేటంటూ అంటున్న సర్కారు తీరు 'సచ్చేదాక అట్లాగే ఉండు పెండ్లి చేస్తా' అన్నట్టుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు, ఇండ్లస్థలాలు, భూ పోరాటాలు చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం ముందుకు సాగుతున్నది.
భూమిలేని దళితులందరికీ మూడెకాల భూమి ఇస్తామనీ, పోడు సాగుదారులందరికీ పట్టాలు చేస్తామనీ, గూడు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కటిస్టామని సీఎం కేసీఆర్ చాలాసార్లు హామీనిచ్చారు. కుర్చీ వేసుకుని మరీ నిర్మాణాలను పర్యవేక్షిస్తాననీ, గృహప్రవేశాల సందర్భంగా లబ్దిదారుల ఇంట్ల పలావన్నం తింటాననీ చెప్పారు. ఏడాది.. రెండేండ్లు..మూడేండ్లు..ఇలా ఎనిమిదున్నరేండ్ల కాలం గడిచిందిగానీ ఇండ్లు మాత్రం ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 40 లక్షల మంది ఇండ్లకోసం దరఖాస్తు పెట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్నవి 2.96 లక్షల ఇండ్లు మాత్రమే. అందులో పూర్తయినవి లక్ష ఇండ్లు. ఇప్పటిదాకా లబ్దిదారులకు అందజేసింది కేవలం 36 వేలు మాత్రమే. అందరికీ ఇండ్లు ఇవ్వలేక సర్కారు చేతులెత్తేసి కట్టిన ఇండ్లను పంచితే ఎక్కడ గొడవ అవుతుందో అని పంచకుండా నాన్చుతున్నది. తాజా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు ముందుకొస్తే మూడు లక్షల రూపాయలిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో అస్సలు ఇంటి జాగా కూడా లేని వారు 30 లక్షల మంది ఉన్నారు. ఆ పేదల్లో అసహనం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇక డబుల్ బెడ్ రూమ్ మీద ఆశలు వదులున్న పేదలు సర్కారు భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
పేదోళ్లు గుడిసెలేసుకుంటున్నరు..సర్కారోళ్లు తగులబెట్టిస్తున్నరు..
రాష్ట్రంలోని దాదాపు వెయ్యి కేంద్రాల్లో ఇండ్లు, ఇండ్లస్థలాలు, భూ పోరాటాలను వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్నది. ఈ పోరాటంలో పేదలు వేలాదిగా పాలుపంచుకుంటున్నరు. రెండు లక్షల పేదలతో దరఖాస్తులు చేయించింది. 17 జిల్లాల్లో 20 వేలకుపైగా పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. 19 జిల్లాల్లో 78 కేంద్రాల్లో పదివేల ఎకరాల సర్కారు భూమి పంచాలని భూ పోరాటం చేస్తున్నరు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40 వేల ఇండ్లల్లో సర్వేచేస్తే 15వేల మంది తమకు కనీసం ఇంటి స్థలం కూడా లేదని చెప్పారు. అద్దెలు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ క్రమంలోనే జక్కలొద్దిలో ఎనిమిది వేల మంది పేదలు 50 ఎకరాల సీలింగ్ భూమిలో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అది సర్కారు భూమంటూ పోలీసోళ్లు లాఠీచార్జీలు చేసి మరీ గుడిసెలు ఖాళీచేయించారు. పేదలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏమైనా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. పైగా, అక్కడున్న 250 ఎకరాలను కబ్జా చేసిన రాజకీయ నేతల చిట్టాను బయటపెట్టి స్వాధీనం చేసుకోవాలనీ, వాటిని పేదలకు పంచాలనే డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు. పోలీసుల సహకారంతో ప్రయివేటు గూండాలు అది తమ స్థలమంటూ గుడిసెవాసులపై దాడులు చేశారు. గుడిసెలకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ప్రాణాలుపోయినా సరే ఇక్కడ నుంచి కదలబోమని ఇంటిజాగ కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోయపోచగూడెంలో 150 మంది పేదలు పోలీసులు అరెస్టుచేసినా, బెదిరింపులకు పాల్పడినా తగ్గేదేలేదంటూ గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వికారాబాద్‌లో ప్రభుత్వ స్థలాన్ని ప్రయివేటు వ్యక్తులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ పేదలు గుడిసెలు వేసుని పోరాటం చేస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెవెన్యూ, పోలీసు అధికారులు కొమ్ముకాయడం గమనార్హం. జనగామ జిల్లా నెల్లుట్లలో ఐదువేల మంది పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. సూర్యాపేట జిల్లాలో 130 గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ అక్కడ ఇండ్లు కట్టివ్వలేదు. దీనిపై పేదలు కొట్లాడుతున్నారు. కోదాడ మండలం కాపుగల్లులో పోలీసోళ్లు రెండు సార్లు గుడిసెలు పీకిపాడేసినా మళ్లీ అక్కడే వేసుకుని పేదలు ఇంటి జాగా కోసం పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో 2007లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున భూపోరాటం జరిగింది. ముదిగొండ దుర్ఘటన తర్వాత రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది చాలా చోట్ల పేదలకు ఇండ్లస్థలాలను ఇచ్చింది. ఆ క్రమంలోనే అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని రామోజీ ఫిల్మిం సిటీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో 700 మంది పేదలకు పట్టాలిచ్చింది. ఇప్పుడు ఆ ఇండ్లస్థలాల భూమిని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తనదాంట్లో కలిపేసుకున్నది. దీన్ని ప్రశ్నిస్తూ ఇటీవల పెద్ద ఎత్తున పోరాటం చేపట్టారు. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసులు ఆర్ఎఫ్సీ యాజమాన్యానికే మద్దతుగా నిలబడటం పలు విమర్శలకు దారితీసింది.
పేదలు పెద్దఎత్తున కదలొస్తున్నారు...పోరాటాన్ని ఉధృతం చేస్తాం
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటాలకు పేదలు పెద్దఎత్తున కదలొస్తున్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో 20వేల మందికిపైగా పేదలు గుడిసెలు వేసుకున్నారు. పోలీసోళ్లు రెండు వేల గుడిసెలను పీకేశారు. మళ్లీ అక్కడ వేసే ప్రయత్నం జరుగుతున్నది. జక్కలొద్దిలో మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. గుడిసెలను కాల్చేయించారు. అయినా, పేదలు తమ పోరాటాన్ని ఆపకపోగా మరింత ధృడసంకల్పంతో ముందుకుసాగుతున్నారు. పేదలందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలిచ్చేదాకా పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఇంకా పదున్నర లక్షల ఎకరాల మిగులు భూముంది. ఆ భూమిని పేదలకు పంచేవరకు వదలబోం.
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య