Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం షురూ
- పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఓటు : స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెన్షన్ సౌకర్యం కల్పించని పార్టీలకు ఓటు వేసే ప్రసక్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తేల్చిచెప్తున్నారు. నో పెన్షన్... నో ఓట్ అంటూ నినదిస్తున్నారు. మహారాష్ట్రలో ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణ కేంద్రంలో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ అన్న డిమాండ్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పారు. పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఉద్యోగుల కుటుంబాలతోసహా ఓటు వేయించే బాధ్యత తమదని అన్నారు. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు కెఆర్ సియాగ్ పాత పెన్షన్ ఇచ్చే రాష్ట్రాల పట్ల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే పాత పెన్షన్ ప్రకటించిన రాష్ట్రాల పెన్షన్ నిధి పట్ల పీఎఫ్ఆర్డిఏ ఉద్యోగుల సొమ్మును వారికివ్వకుండా, ప్రభుత్వం ఉద్యోగిపై పెట్టిన పెన్షన్ పెట్టుబడిని కూడా ఇవ్వకుండా చేయడం సరైంది కాదన్నారు. అలాంటి చట్టం లేదనే సాకును చూపుతూ దేశంలోని 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎంతో కష్టం మీద తెచ్చిన పెన్షన్ సంస్కరణలు కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. అంతే తప్ప పెన్షన్ ముఖ్యోద్దేశ్యమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన భృతి కల్పించట్లేదన్నారు. దేశంలో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ అమలవుతున్నదని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో పాత పెన్షన్ సాధించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే స్పందించి సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే సాధారణ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఓపీఎస్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర రాజ్య జిని పెన్షన్ సంఘటన్ వితేష్ ఖండేకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి విజరు కుమార్ బందు, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు సుశీల్, నటరాజ్ తదితరులు హాజరయ్యారు.