Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవలా రచన చేసిన విద్యార్థినిలతో మంత్రి వేముల భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమనీ, దానికి అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ''హైదరాబాద్ బుక్ ఫెయిర్'' ఎగ్జిబిషన్‌లోని 38వ నంబర్ స్టాల్లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారు రాసిన పుస్తకాలు చూసి, ప్రతిభను మెచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటర్,డిగ్రీ కాలేజీలు నెలకొల్పారని చెప్పారు. ఆడపిల్లల చదువుకు ఇబ్బంది కాకూడదని ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు కొత్తగా నెలకొల్పారని వివరించారు. వారికి కాలేజీలో అందుతున్న విద్య, వసతిపై ఆరా తీశారు. భవిష్యత్‌లో మరింత రాణించాలని ఆశీర్వదించారు. విద్యార్థినుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించిన ఇంగ్లీష్ లెక్చరర్ సంధ్య దీప్తిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, డీసీసీబీ వైస్ చైర్మెన్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.