Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిత్తూరులో త్వరలో బాటిలింగ్ ప్లాంట్
- ఐఒసి ఇడి అనీల్ కుమార్ వెల్లడి
హైదరాబాద్ : వచ్చే ఏడాది ముగింపు నాటికి పరదీప్- హైదరాబాద్ పైపులైన్ ప్రాజెక్టు పూర్తి కానుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎపి, తెలంగాణ హెడ్ బి అనీల్ కుమార్ తెలిపారు. ఇటీవలే ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విలువ రూ.3,338 కోట్లుగా ఉందన్నారు. దీనికి సంబంధించి నల్గొండలోని మల్కపూర్ నూతన టెర్మినల్ 2023 డిసెంబర్ ముగింపు నాటికి అందుబాటులోకి రానుందన్నారు. 1,212 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్ ద్వారా ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇంధనాల సరఫరా జరగనుంది. మల్కపూర్ టెర్మినల్‌ను రూ.611 కోట్లతో అభివృద్థి చేస్తున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు నాటికే ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. భూ సమీకరణ ఆలస్యం కావదంతో ఆలస్యమయ్యిందన్నారు. తెలంగాణలో ఐఒసి 1425 రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉందని అనీల్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రజల అవసరాలను తమ చర్లపల్లి, రామగుండం టెర్మినళ్లు తీర్చగలవన్నారు. తెలంగాణలోని పెట్రోల్ విక్రయాల్లో 34.6 శాతం, డీజిల్‌లో 38 శాతం, ఎల్పిజిలో 40 శాతం చొప్పున ఐఒసి వాటాలు కలిగి ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో సిఎన్‌జికి సంబంధించి 46 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయన్నారు. చిత్తూరులో మరో మూడు మాసాల్లో బాటిల్లింగ్ ప్లాంట్‌ను అందుబాటులోకి తేనున్నామన్నారు. ఈ సమావేశంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ మేనేజర్ కె మురళి పాల్గొన్నారు.