Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదు
- సాంకేతిక పరిజ్ఞానంతోటే అన్ని పరీక్షలు నిర్వహించాం : టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ వీవీ శ్రీనివాసరావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు జరుగనున్న తుది అర్హతా పరీక్షలకు 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారని రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మెన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల డిసెంబర్ 8 నుంచి ఈనెల 5 వరకు సాగిన పీఎంటీ, పీఈటీ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఇందులో 1,11,209 మంది అభ్యర్థులు తుది పరీక్షను రాయడానికి అర్హతను సాధించారని ఆయన తెలిపారు. ఎస్సై తత్సమాన పోస్టులు 554 పోస్టులు ఉండగా, కానిఐస్టేబుల్ తత్సమాన పోస్టులు 15644 లకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, సివిల్ తత్సమాన కానిస్టేబుల్ పోస్టులకు పీఎంటీ, పీఈటీ పరీక్షలో జరిగిన పోటీలలో 90488 మంది అభ్యర్థులు నెగ్గగా ఇందులో పురుషులు 67606 మంది, మహిళలు 22882 మంది ఉన్నారు. కాగా ఎస్సై తత్సమాన పోస్టులకు జరిగిన పీఎంటీ, పీఈటీ పరీక్షలో 52786 మంది అభ్యర్థులు నెగ్గగా ఇందులో పురుషులు 41256 మంది, మహిళలు 11530 ఉన్నారని ఆయన తెలిపారు. మొత్తంమ్మీద ఈ మారు 53.70 శాతం మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు ఎంపిక కాగా గతంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు హాజరైన శాతం 51.95 శాతం మాత్రమే. అంటే ఈమారు 5.18 శాతం మంది అభ్యర్థులు ఎక్కువగా తుది రాత పరీక్షకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. అలాగే గతంలో ఈ పోస్టులకు నిర్వహించిన పరీక్షలలో కొన్నింటిని ఈ మారు తగ్గించడం జరిగిందని వివరించారు. ముఖ్యంగా పీఎంటీ, పీఈటీలో గతంలో ఐదు పరీక్షలు ఉండగా ఈ మారు మూడు మాత్రమే పరీక్షలను నిర్వహించామని ఆయన అన్నారు. అంతేగాక ఈ మారు పూర్తిగా పరీక్షలను పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడి నిర్వహించామని ఇందులో ఏమాత్రమూ అవకతవకలు చోటు చేసుకోలేదని శ్రీనివాసరావు వివరించారు. నిర్ణీత మార్చి 12వ తేదీ నుంచే ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.