Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-1960 పోస్టులు మంజూరు
-తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించబోయే మైనారిటీ గురుకులాలకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 70 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా 1960 పోస్టులను శాంక్షన్ చేసింది. ఔట్ సోర్సింగ్ కింద 280 పోస్టులను భర్తీ చేయనుంది. మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన మైనారిటీ సంక్షేమశాఖ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2016-17 విద్యాసంవత్సరం జూన్‌లోనే మైనారిటీ గురుకులాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు, సిబ్బంది నియామకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ(టీఎమ్ఆర్ఇఐఎస్) కింద 70 మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2016 సంవత్సరంలో 700 పోస్టులు, 2017లో 490 పోస్టులు, 2018లో 770 పోస్టులను భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 70 ప్రిన్సిపల్ పోస్టులు, 490 జూనియర్ లెక్చరర్స్, 420 పీజీటీఎస్, 560 టీజీటీఎస్, 70 ఫిజికల్‌ఎడ్యుకేషన్ టీచర్స్, 70 ఫిజికల్డైరెక్టర్, 70 లైబ్రరేయన్, 70 సాప్ట్ నర్స్, 70 క్రాప్ట్ అండ్ ఆర్ట్, మ్యూజిక్, 70 సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్టు రిక్రూట్మెంట్ కింద రూల్స్ ఆప్ రిజర్వేషన్ ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఔట్ సోర్సింగ్ కింద 140 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, 70 ఆఫీసు సబార్డినేట్, 70 ల్యాబ్ అడింటర్లను తీసుకుంటారు. 2016లో 140, 2018లో మరో 140 మందిని భర్తీ చేస్తారు.
మైనార్టీ సంక్షేమశాఖలో 45 కొత్త పోస్టులకు అనుమతి
మైనారిటీ సంక్షేమశాఖలో కొత్తగా 45 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జాయింట్‌డైరెక్టర్(1), డిప్యూటీ డైరెక్టర్(1), అసిస్టెంట్ డైరెక్టర్(3), సీనియర్ అసిస్టెంట్(3)లను ప్రమోషన్ ద్వారా తీసుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్(ఎస్ఎల్ఆర్), సర్వేయర్లను రెవెన్యూశాఖ నుంచి డిప్యూటేషన్‌పై నియమిస్తారు. సూపరింటెండెంట్(2)లను డిప్యూటేషన్ లేదా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఫైనాన్స్ విభాగం నుండి అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్, జూనియర్ అకౌంట్లను డిప్యూటేషన్‌పై తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ కింద జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్(2), ఆఫీసు సూపరింటెండెంట్(2), డ్రైవర్(1)ను భర్తీ చేస్తారు. అదేవిధంగా జిల్లాల్లో పదేసి చొప్పున అసిస్టెంట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్, అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్లను నియమిస్తారు. జిల్లాల్లోనూ ఔట్ సోర్సింగ్ కింద 30 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.