Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాసిరకం చీరల పంపిణీపై మహిళల గుస్సా
- పలుచోట్ల చీరల దహనం
- రూ.50 చీర కోసం రెండ్రోజులు పనిచెడ్డామంటూ ఆవేదన
- కేసీఆర్ ఇంటోళ్లు ఇవే కట్టుకుంటరా అంటూ ప్రశ్నలు... బతుకమ్మ ఆడి నిరసన
- పలుచోట్ల మహిళలపై కేసులు, అరెస్టులు
చేనేత చీరలంటూ ఊదరగొట్టి సింథటిక్ చీరలను సర్కారు పంచుతోందని ఆడబిడ్డల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'చీరలా..? నారపోగులా..?' అంటూ సర్కారు తీరును ఎండగట్టారు. '50 రూపాయల చీర కోసం రెండ్రోజులు పనిచెడ్డాం. రోజంతా నిలబెట్టి గీ చీరలిస్తారా' అంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. 'నాసిరకం చీరలిచ్చి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమాన పరిచారు. కేసీఆర్ భార్య, బిడ్డ, కోడలు పండుగనాడు ఇవే బట్టలు కట్టుకుంటరా?' అంటూ సీఎంను నిలదీశారు. బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాల్లో పలుచోట్ల సోమవారం చీరలను దహనం చేశారు. చీరలను తగులబెట్టిన ఘటనల్లో పలుచోట్ల మహిళలపై కేసులు నమోదు చేశారు.
నవతెలంగాణ-యంత్రాంగం
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్‌లోని సరస్వతినగర్ శిశుమందిర్ స్కూల్లో సౌకర్యాలు సరిగా చీరల పంపిణీ కార్యక్రమంలో తోపులాట జరిగింది. మహిళలు జుట్లు పట్టుకుని గొడవకు దిగారు. కొట్టుకున్నారు. అధికారులు చేసేదేమి లేక స్తబ్దుగా ఉండిపోయారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 22,23వ వార్డుల్లో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పుపెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. నిరసన తెలిపిన వారిపై కేసు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆలేరులోనూ చీరలను తగులబెట్టారు. చౌటుప్పల్‌లో రోడ్డు వెంట ఉన్న పెన్సింగ్‌కు చీరలు కట్టి నిరసన తెలిపారు. భూదాన్‌పోచంపల్లిలో ఈ చీరలు మాకొద్దంటూ సుమారు 100 మంది మహిళలు అక్కడే పడేసి వెళ్లిపోయారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో బతుకమ్మ చీరలు తగులబెట్టారంటూ ఇండెపుడి పద్మ, బదావత్ భద్రమ్మ, బాణోత్ బుజ్జారి అనే గిరిజన మహిళలతో పాటు మరో మహిళను స్థానిక ఎస్సై ఒడ్డెపల్లి మురళి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సత్తుపల్లి మండలం పెనుబల్లిలో చీరలను తగులబెట్టడంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు మోరంపూడి బాబూరావు, మొక్కర భూపాల్రెడ్డిను ఎస్సై నవీన్ అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ల ఆదేశాల మేరకు పెనుబల్లి, టేకులపల్లి మండలాల్లో ఈ ఘటనకు బాధ్యులైన వారికోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. భద్రాచలంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాల్గొన్నారు. నాసిరకమైన చీరలు పంపిణీ చేస్తున్నారంటూ పలువురు మహిళలు ప్రభుత్వంపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య...మహిళల నుంచి నిరసన వ్యక్తమవుతుండటంతో మధ్యలోనే వెళ్లిపోయారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మధ్యాహ్నం వరకు కూడా రాకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఎర్రటి ఎండలోనే పడిగాపులు గాచారు. మధిర మండలం ఇల్లందులపాడులో చీరలను రోడ్డుపై తగులబెట్టారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కావాలనే రాద్దాంతం చేశారనీ, ఇది రాజకీయంగా టీఆర్ఎస్ను అభాసుపాలు చేసే కుట్రలో భాగమేనని అన్నారు.'నాసిరకం చీరలు మాకొద్దు. చీరలు పంచాలని అడిగామా? పండుగ సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే బాగుండేది'....అంటూ వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 14, 15, 16 వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో సర్కారు చీరలను చూసి 'ఇవేం చీరలు, 50 రూపాయల చీరలకోసం లైన్లో నిల్చొని రోజంతా పోయిందని, కూలీకిపోతే రూ.300 వచ్చేవని' ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల చీరలు తగలబెట్టారు, వాలీబాల్కోర్టులో నెట్‌గా కట్టి నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లాలోని చలిగల్‌లో పంచాయతీ కార్యాలయం ఎదుటే కుప్పగా పోసి దహనం చేసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా చీరలు తగులబెట్టారంటూ ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలు కుప్పగా వేసి ప్రభుత్వంపై విమర్శలతో కూడిన పాటలతో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. లకిëపూర్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో రాస్తారోకో చేశారు. కమాన్‌పూర్‌లో ధర్నా చేశారు. అక్కడ పోలీసుల బందోబస్తు నడుమ చీరల పంపిణీ జరిగింది. ధర్మారం మండలం నందిమేడారంలో చీరలను తీసుకోవడానికి మహిళలు నిరాకరించారు. పెద్దపల్లిలో ఇచ్చిన చీరలను అక్కడే పడేసి కొన్నింటిని దహనం చేశారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆందోళనకు దిగారు. చీరలను అక్కడే పారేసి పోయారు. కరీంనగర్జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లితో మహిళలు చీరలను తగులబెట్టారు. ఇల్లందకుంటలో ఎంపీపీ గంగారపు లతను మహిళలు నిలదీశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద చీరలను అంటుపెట్టడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం హున్సా, రెంజల్ మండలం బోర్గాం, తాడ్‌బిలోలి, నీల, భీంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు ఆందోళనా కార్యక్రమాలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని మాలలగురిజాలలో చీరలను తగులబెట్టారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన మహిళలు బతుకమ్మ చీరలను దహనం చేశారు. మహాలక్ష్మివాడ పాఠశాలలో ఉదయం మంత్రి జోగురామన్న చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోగానే ఈ చీరలను మంత్రుల, ఎమ్మెల్యేల భార్యలు, కూతుర్లు కట్టుకుంటారా అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరకాల నగరపంచాయితీ కార్యాలయం ఆవరణలో చీరల పంపిణీ కార్యక్రమం వద్ద మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నర్సంపేట జాతీయ రహదారిపై చీరలు పరిచి రాస్తారోకోకు దిగారు. చెన్నారావుపేట, జనగామల్లో నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్నూర్ పాఠశాలలో, ఉర్దూమీడియం పాఠశాలలో చీరలను తగులబెట్టారు. బొద్దుగొండలో టీఆర్ఎస్ ఎంపీటీసీ నునావత్ అనిత, కాంగ్రెస్ సర్పంచ్ గుగులోతు సుచిత్ర మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని పద్మానగర్‌లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు బాగాలేవని రోడ్డుమీద పడేశారు. ఆటోలను, బైకులను తూడ్చుతూ నిరసన తెలిపారు. మిర్యాలగూడ, నకిరేకల్‌లో చీరలు తీసుకున్న మహిళలు 'ఇవేం చీరలు..వారి బొంద చీరలు' అంటూ అసహనం వ్యక్తం చేశారు. నకిరేకల్, తిప్పర్తిలో చీరెలు దహనం చేశారు.మెదక్ జిల్లాలోని అటవీశాఖ కార్యాలయం వద్ద చీరల కోసం ఉదయం నుంచి మహిళలు బారులు తీరారు. చివరికి ఆధార్ కార్డు, రేషన్‌కార్డులు సరిగా లేవని కొంతమందికి ఇవ్వలేదు. కౌడిపల్లిలో ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేసిన తర్వాత లెక్క సరిగా రావడం లేదని అధికారులు మళ్లీ తీసుకున్నారు. ఆధార్ చూపించాలని చెప్పడంతో పరిస్థితి గందరగోళం నెలకొంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నాసిరకం చీరలపై మహిళలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్‌లో చీరలను గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వేసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.