Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల వర్షంతో మిరప రైతులకు అపార నష్టం
- కల్లాల్లో, మార్కెట్లో తడిసిన పంటలు
- పలుచోట్ల రాలిన మామిడి.. నేలకొరిగిన మొక్కజొన్న
నవతెలంగాణ-యంత్రాంగం
శుక్రవారం రాత్రి, శనివారం పలుచోట్ల కురిసిన అకాల వర్షం రైతన్నలకు అపార నష్టాన్ని చేకూర్చింది. మార్కెట్లల్లో, కల్లాల్లో ఉంచిన మిర్చి పంట వర్షానికి తడిసిపోయింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో శుక్రవారం రాత్రి పిడుగుపడి పల్లె లింగంగౌడ్కు చెందిన పాడి ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. అదే విధంగా భారీ వర్షం కురవడంతో ఇదే మండలం రాంనుంతల పెద్దతాండాకు చెందిన లాలూనాయక్ అనే రైతుకు చెందిన టమాట తోట పూర్తిగా నేలమట్టమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిర్చి, మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. సుమారు ఐదువందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగినట్టు, రెండు వందల క్వింటాళ్లకుపైగా మిర్చి తడిసి నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అరటి, మామిడి, బొప్పాయి పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లలో మామిడి తోటల్లోని పూత, పిందెలు రాలిపోయాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని, బోనకల్, ఖమ్మం రూరల్, కూసుమంచి, వైరా, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, మధిర, కామేపల్లి, కారేపల్లిలలో వర్షం ఎక్కువ పడింది. భద్రాద్రి జిల్లాలో చంద్రుగొండ, కొత్తగూడెం, జూలూరుపాడు, పాల్వంచ, తదితర మండలాల్లో కల్లాల్లోని మిర్చి తడిసిపోయింది. రాత్రివేళ వర్షం రావడంతో రైతులు ఇంటివద్దనుండి కల్లాల దగ్గరికి వెళ్లేసరికే మిర్చి తడిసిపోయింది. మొక్కజొన్న పంట నేలకొరింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. వర్షపునీరు రోడ్లపై భారీగా ప్రవహించింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాల్లో వర్షం వల్ల మిర్చి, పత్తి, మొక్కజొన్న పొలాలు దెబ్బ తిన్నాయి. బయ్యారం మండలంలో మిర్చి కోతలు కోసి, ఆరబోసిన రైతాంగానికి క్షణాల్లో వర్షం రావడంతో మిర్చి తడిచిపోయింది. గార్లలో మండల పరిధిలోని పినిరెడ్డిగూడెం, సీతంపేట, రాంపురం, మద్దివంచ, పుల్లూరు, మర్రిగూడెం, బుద్దారం, వెంకటాపురం, పోచారం, గోపాలపురం, ముల్కనూరు, చిన్న, పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం గ్రామాల్లో రెండు వందల క్వింటాళ్లకు పైగా కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో పలుచోట్ల మార్కెట్లలో వేరుశనగ పంట తడిసిపోయింది.