Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంజారాహిల్స్‌లో రవిప్రకాశ్ అడ్వకేట్ ఇంట్లో సోదాలు
- నేను పారిపోలేదని వీడియోక్లిప్పింగ్ పంపిన శివాజీ
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
టీవీ9 ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడు రవిప్రకాశ్, నటుడు శివాజీల కోసం సైబరాబాద్ పోలీసులు లుక్‌అవుట్‌నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో రవిప్రకాశ్ అడ్వకేట్ నివాసంలో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. టీవీ9 ఫోర్జరీ కేసు శనివారం మరో మలుపు తిరిగింది. విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీల కోసం సైబరాబాద్ పోలీసులు లుక్అవుట్ నోటీసు అస్త్రాన్ని ప్రయోగించారు. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపించిన అధికారులు అందులో రవిప్రకాశ్, శివాజీల ఫోటోలు, వారి వివరాలు, నమోదైన కేసులను తెలిపి విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరినట్టు తెలిసింది. తామిచ్చిన రెండు నోటీసులకు స్పందించని కారణంగా వారికి తాజాగా లుక్అవుట్ నోటీసులను జారీ చేసినట్టు సైబర్‌క్రైమ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో సహకరించారనే అనుమానాలతో రవిప్రకాశ్‌కు చెందిన లాయర్ నివాసంలో సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం సోదాలను నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రాజు అనే సదరు లాయర్ నివాసంలో చాలా సేపు సోదాలు జరిపిన అధికారులు కొనిన డాక్యుమెంట్లను సీజ్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తానెక్కడికి పారిపోలేదనీ, వడ దెబ్బ కారణంగా చికిత్స పొందుతున్నానని సినీనటుడు శివాజీ తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్‌ను ఆయన సోషల్ మీడియాకు పంపించారు. తనది కేవలం సివిల్ కేసుతో సంబంధం ఉన్న అంశమనీ , దానిని క్రిమినల్ కేసుగా మార్చి ఇబ్బంది పెడుతున్నారని ఆయన అందులో వ్యాఖ్యానించారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు పిలిచిన వెంటనే విచారణకు వచ్చి అన్ని విషయాలు తెలుపొచ్చు కదా అని సైబర్‌క్రైమ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కేసు విషయంలో సీరియస్‌గా కదులుతున్న సైబర్‌క్రైమ్ అధికారులు మరో వైపు రవిప్రకాశ్, శివాజీల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది.