Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు అరెస్ట్..9 గ్రాముల కొకైన్ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాట్సప్‌లో ఆర్డర్లు తీసుకొని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న భార్యాభర్తలను మంగళవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 గ్రాముల కొకైన్, కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకీలో నివాసముండే భార్యాభర్తలు షేక్ ఫహీద్, సలీమా రూబేల్ షేక్ సులువుగా డబ్బులు సంపాదించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేస్తూ గతేడాది జనవరిలో జూబ్లీహిల్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే, జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఫిల్మింనగర్‌లో నెలకు రూ.75వేలు చెల్లించి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని ప్రారంభించారు. అక్కడికి వచ్చే విటులకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. సన్‌సిటీలో నివాసముంటున్న నైజీరియన్‌ను పరిచయం చేసుకున్న షేక్ ఫహీద్ అతని నుంచి గ్రాము కొకైన్ రూ.6వేలకు కొనుగోలు చేస్తున్నాడు. వాట్సప్‌లో ఆర్డర్లు తీసుకుని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలీ, కూకట్‌పల్లితోపాటు ఇతర ప్రాంతాల్లో తెలిసిన వారికి గ్రాము కొకైన్ రూ.7500కు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్టు అంజిరెడ్డి తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు.