Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం జోక్యం చేసుకొని పరిష్కరించాలి :ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
- హైదరాబాద్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు తక్షణమే బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బదిలీలు చేయాలని కోరుతూ మంగళవారం ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న విద్యాభవన్ వద్ద ధర్నా జరిగింది. ఫ్లకార్డులు ప్రదర్శించి బదిలీలు చేపట్టాలని పెద్దఎత్తున నినా దాలు చేశారు. ముఖ్యఅతిధిగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడుతూ 2013-14 విద్యాసంవత్సరంలో ఐదేండ్లు ఒకేచోట పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులను నాటి ప్రభుత్వం బదిలీలు చేసిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బదిలీలు చేపట్టకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహి స్తుండడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. అందుకే ముఖ్య మంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని బదిలీల సమస్యను పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. ధర్నా అనంతరం ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఎ అశోక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన అశోక్ ఈనెలాఖరు తర్వాత బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. అందరికీ అవకాశం లేకపోతే పరస్పర (మ్యూచువల్) బదిలీలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత ధర్నానుద్దేశించి ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ ఏదైనా కారణాలతో కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలకు అవకాశం లేకపోతే మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని హెచ్చరించారు. అనేక ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తూ వందల కిలోమీటర్ల దూరంలో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నా మని అన్నారు. బదిలీలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదన్నారు. బదిలీలు చేపట్టే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కెపి శోభన్‌బాబు, కోశాధికారి ఎన్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి జబీఉల్లా, నాయకులు యు సంగీత, రమాదేవి, కురుమూర్తి, ప్రవీణ్‌కుమార్, గోవర్ధన్ పాల్గొన్నారు.