Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే విగ్రహావిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ- మహబూబాబాద్
సామాజిక విప్లవం కోసం పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందనీ, అందుకోసం పోరాడిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అని పలువురు వక్తలు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శనివారం బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మెన్ ప్రొఫెసర్ మురళీమనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరిహర గార్డెన్లో నిర్వహించిన సభలో మురళీమనోహర్ మాట్లాడారు. జ్యోతిరావు పూలే అన్ని వర్గాల్లో సామాజిక విప్లవం, ఐక్యత కోసం పోరాటం నిర్వహించారన్నారు. దేశ భవిష్యత్ కోసం సమాజంలో కార్మికులు, కూలీల కోసం ఉద్యమాలు, రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని చెప్పారు. రాజ్యాంగంలో పేదలకు కల్పించిన హక్కులను నేటి పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో మంది విగ్రహాలు ఉన్నాయన్నారు. అంత మాత్రాన వారందరూ మహనీయులు కాలేరని, అందులో కొంతమంది మాత్రమే సమాజంలో ఉత్తేజం నింపి చైతన్యం కోసం పనిచేశారని అన్నారు. పేదల హక్కుల కోసం ఆనాడు కమ్యూనిస్టులు ముందుకు సాగాలని పూలే అన్నారని గుర్తు చేశారు. పూలేను బీసీ నాయకుడిగా కాకుండా అన్ని వర్గాల నాయకునిగా చూడాలని కోరుకున్నారన్నారు. మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సమాజంలో గిరినులు, ఆదివాసీలు, గోండులు, దళితులు అందరూ వెనుకబడిన వారేనని చెప్పారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కులం కోసం, తమ సామాజిక తరగతి కోసం పోరాటం చేస్తున్నారని, అలా కాకుండా వెనుకబడిన తరగతులంతా కలిసి పోరాడాలని అన్నారు. అదే సామాజిక న్యాయం అన్నారు. సమస్యల వారీగా పోరాటాలు నిర్వహించాలన్నారు.
సమాజంలో వెనుకబడిన తరగతుల కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, వారికోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం కేసీఆర్ రాష్ట్రంలో 119 జ్యోతిరావు పూలే గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సభకు పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు కొమరయ్య అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, స్థానిక నాయకులు ఎం.పాపారావు, బొబ్బల యాకోబ్రెడ్డి, చాగంటి కిషన్, రంగారావు, కిషన్, సత్యనారాయణ పాల్గొన్నారు.