Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం అభినందనీయం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నామనీ, హైదరాబాద్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడం అభినందనీయమనీ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఎఫ్డీసీ అధికారులు ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్నారు. ఐటీ కారిడార్‌లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకుగానూ ఈ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు అంతర్జాతీయ గుర్తింపు రావడం గొప్ప విషయమని అన్నారు.
ఒక పార్కుకు దేశంలోనే ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం ఇదే మొదటిసారి అని అన్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో బొటానికల్ గార్డెన్ ను మరింత సుందరంగా తీర్చి దిద్దుతామని ఆయన అన్నారు. సందర్శకులు, వాకర్స్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం బొటానికల్ గార్డెన్ లో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేశారు. పార్కులో సౌకర్యాలపై సందర్శకులను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజే శ్వర్ తివారీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘు వీర్, హెచ్వైయం సీఈవో అలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.