Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆడుకుంటూ వెళ్లి పడిపోయిన చిన్నారి
- మెదక్ జిల్లా పాపన్నపేటలో ఘటన
- ఆక్సిజన్ పంపించి సహాయక చర్యలు
నవతెలంగాణ-పాపన్నపేట
తన తాత మూడుబోర్లు తవ్వించాడు. అయినా చుక్కనీరు పడక కుటుంబమంతా బాధతో ఇంటిదారి పట్టింది. ఇంతలో రెప్పపాటు క్షణంలో ఆ కుటుంబంలో మరో పెనువిషాదం! ఆడుకుంటూ వెళ్లిన మూడేండ్ల బాలుడు అర గంట క్రితం తవ్వించిన బోరుబావిలోకి జారిపోయాడు. చీర వేసి బాబును పైకిలాగేందుకు కుటుంబసభ్యులు యత్నించినా ఫలించలేదు. రంగంలోకి దిగిన బృందాలు రాత్రివరకూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సంగా రెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన సంజరు సాయివర్దన్ (3) తన తల్లిదండ్రులతో కలిసి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామంలోని తాత మంగలి బిక్షపతి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తన పొలంలో బిక్షపతి బోరు వేయించినా నీరు పడలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 వరకు మరో రెండు బోరుబావులు తవ్వించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కాలుజారిన బాలుడు బోరుబావిలోకి జారిపోయాడు. కుటుంబీకులు చీరకొంగు వేసినా అందలేదు. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇవ్వగా ఆర్డీవో సాయిరాం, ఎస్సై ఆంజనేయులు, తహసీల్దార్ బలరాం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం జేసీబీ, 108 వాహనాన్ని రప్పించి బాలున్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గుంతలోకి ఆక్సిజన్ పంపించారు. బోరుబావి 120 అడుగులు ఉన్నట్టు తెలిసింది. ఆ బోరుబావి పక్కనే కూర్చుని బోరున విలపిస్తున్న తల్లిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
30 ఫీట్ల లోతులో..?
120 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలోకి జారిపోయిన బాలుడు 25 నుంచి 30 ఫీట్లలోతు పడిపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. కేసింగ్ కూడా అక్కడిదాకా వేసి తీసేసినట్టు సమాచారం. జేసీబీలు కూడా సమాంతరంగా తవ్వుతున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్‌ను పంపిస్తున్న అధికారులు బుధవారం రాత్రిదాకా సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం వందమందికిపైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనగా, ఫైరింజన్, అంబులెన్సును అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటున్నాయనీ, వాళ్ల సూచన మేరకు ఇతర చర్యలు తీసుకుంటామనీ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. మూడు బోర్లు తవ్వినా అవన్నీ ఫెయిలయ్యాయనీ, అందులోని ఒకదాంట్లో బాలుడు కాలుజారిపడిపోయాడనీ ఆయన పేర్కొన్నారు.