ప్రశ్న : భూమి గుండ్రంగా గోళాకారంలో వుందంటు న్నారు కదా! మరి గోళానికి కింద వున్న నీరు కిందికి పడిపోవా? గోళాకారమంటే వంకర ఉపరితలం కదా. దానిమీద ఉన్న మనం జారి పడిపోమా? భూమి గుండ్రంగా తిరిగే క్రమంలో ఇపుడు పైన ఉన్న మనం భూమికి అవతలవైపునకు వెళ్లినపుడు కిందికి పడిపోమా?
- వాట్సాప్ ద్వారా ఓ పాఠకుడు.
జవాబు : నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో '1969 లోనే అమెరికా వాళ్లు చంద్రుడి మీదకు వెళ్లి అక్కడ కాలు పెట్టారవ్వా' అంటే... 'నోరు మూసుకోరా అలా పైకి వెళ్లిన వాళ్లకు చంద్రుడి దగ్గరకు పోగానే తలకు కొట్టుకోడా! అలా పైకి వెళ్లిన వాళ్లు పైన తల కాళ్లు కింద వుంటే చంద్రుడి మీద కాళ్లు ఎలా పెట్టగలర్రా. నీకు చదువు చెప్పినవాడ్ని పట్టుకొని నాలుగు తన్నాలి' అంది. అంతేకాదు ఆమె 105 సంవత్సరాల పాటు బతికింది. కానీ చనిపోయేంత వరకూ చంద్రుడ్ని దేవుడుగాను, అక్కడ తనలాంటి బామ్మ ఒకరు దోశలు చేస్తున్నట్లు నమ్మేది. భూమి బత్తాయి పండులాగా, ఫుట్బాల్ లాగా గుండ్రంగా వుందవ్వా' అంటే నామీద చాలా కోపానికి వచ్చేది. నాకు సరియైన తెలివి స్కూల్లోనే నేర్పడంలేదని నాగురించి చాలా బెంగపడదేవి. మా అమ్మమ్మకు చదువురాదు. కానీ చదువుకొంటున్న వాళ్లకు, స్మార్ట్ఫోన్ వాడుతూ వాట్సాప్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దబదబా టెక్ట్స్ మెసేజ్లు కొట్టగలిగిన మీలాంటి వారికి కూడా భూమి గుండ్రత్వం గురించి, సముద్రపు నీటి నిలకడ గురించి ఆవలివైపు వారి స్థితిగతుల గురించి సందేహాలు రావడమంటే మా బామ్మ మా ఉపాధ్యాయుల గురించి అన్నమాటే గుర్తొస్తోంది. భూమి ఒక పదార్థం. దానికి ద్రవ్యరాశి (ఎaరర) వుంది. మనకూ ద్రవ్యరాశి వుంది. ద్రవ్యరాశి ఉన్న రెండు వేర్వేరు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం వుంటుంది. అంటే భూమి గోళాకారంలోనే వున్నా ఆ భూమికి, మనకు మధ్య ఆకర్షకబలం వుంది. మనం భూమ్మీద ఎక్కడున్నా ఆ ఆకర్షకబలం వల్ల మనల్ని భూమి తనపైనే ఉండేలా ఆకర్షిస్తుంది. నేలనుండి కిందికి పోలేము కాబట్టి నేలమీదే వుంటాము. నీటిలోకి చొచ్చుకు పోగలం కాబట్టే అదే భూమి నీటి అడుగున ఉన్న అడుగు భాగం వరకు వెళ్లేలా చేస్తుంది. అందుకే నీటిలో పడ్డ రాయి మునుగుతుంది. ఈత రాకపోయినా వచ్చినా ఈదక పోయినా భూమ్యాకర్షణ వల్ల నీటిలోకి మునిగిపోతాము. మనకు, భూమికి మధ్య ఆకర్షక బలం వుండడం వల్ల మనం భూమి మీదే వున్నట్టే భూమి మీద ఉన్న సముద్ర జలాలకు, సరస్సులోని నీటికి, బావుల్లోని నీటికి, కాలువలు, నదులు, బకెట్లు, మురికి గుంటలు, రోడ్డు మీద బొందలు తదితర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటికి ద్రవ్యరాశి వుంది. కాబట్టి ఆ నీటిని కూడా భూమి తనవైపు ఆకర్షించి తనకు అంటిపెట్టుకొంటుంది. మీరన్నట్టు పగటిపూట మనం పైన, రాత్రిపూట మనం భూమికి అడుగున (ఆవలివైపు) వున్నట్టు భావించినా పగలు భూమివైపు కాళ్లు, నేలకు లంబదిశలో కాళ్లకు వ్యతిరేక దిశలో తల ఉండేట్లు ఎలా నిలబడ్డామో... ఆవలివైపునకు వెళ్లినపుడు కూడా భూమితో పాటు మనమూ తిరుగుతూ ఎల్లపుడూ భూమి వైపు కాళ్లు, కాళ్లకు వ్యతిరేక దిశలో రాత్రి ఆకాశం వైపు తల ఉండేట్లే నిలబడతాము. లేదా మంచం మీదో, చాప మీదో పడుకుంటాము. అలా పడుకున్నపుడు మనం ఎక్కడికి జారి పడిపోము. ఎందుకంటే మనల్ని భూమి తన ఆకర్షక బలంతో అంటిపట్టుకొంటుంది. మనల్ని భూమ్యాకర్షక బలపు పట్టు నుంచి ఊడబెరికి 'కిందికి' జారేలా లాక్కునే మరో ఖగోళ వస్తువు దరిదాపుల్లో ఎక్కడా లేదు. ఇలా ఎంత చెప్పినా మీకున్న సందేహం పూర్తిగా సమసిపోదు. కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. దాన్ని మీరు ఆలోచన ద్వారా గానీ లేదా ప్రాయోగికంగా పళీళీజువు చేసుకొనే పరిశీలన ద్వారా గానీ ఖరారు చేసుకోండి. గుండ్రటి అయస్కాంతాన్ని ఊహించండి. దానికి పైభాగాన ఒక చీలను నిలబెట్టండి. అది అయస్కాంతపు ఆకర్షణ కు లోనుకావడం వల్ల అంటుకొంటుంది. ఇపుడు మెల్లగా ఆ అయస్కాంతపు గోళం మీద వున్న చీలతో సహా అయస్కాంతాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పండి. ఏమి గమనించారు (లేదా ఊహిం చారు). ఆ చీల అయస్కాంతానికి అంటుకొనే వుంటుం ది. నిజానికి కింద మన భూమి ఉన్న దాని మీద భూమ్యాకర్షక బలం కన్నా అయస్కాంత బలపు ఆకర్షణ ఎక్కువ. కాబట్టి పడిపోకుండా అలాగే వుంటుంది. ఇపుడు ఆ అయస్కాంతాన్ని భూమిగా, మనల్ని, సముద్రపు జలాల్ని చీలగా ఊహించండి. అయస్కాంత బలం లాగే భూమ్యాకర్షక బలం వల్ల మనం భూమికి అంటిపెట్టుకొనే వుంటాము. భారతదేశంలో మనము, భూమికి అవతల అమెరికాలో అమెరికన్లు భూమివైపే కాళ్లు వుండేలా భూమికి అంటిపెట్టుకొనే వున్నాం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization