ప్రశ్న : ఈ మధ్య వాట్సాప్లో ఓ వింత వైరల్ అవుతోంది. ఒకేరోజు అమెరికా, కెనడా దేశాల్లో ఆకాశం లో పక్కపక్కనే రెండు సూర్యుళ్లు ఉదయిస్తున్నట్లు చూశాము. దీన్ని నాసా వాళ్లు కూడా పరిశోధించి ప్రపంచ ప్రళయానికి ఇది చిహ్నమేనని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు... యూట్యూబ్ లో కూడా వీడియో చిత్రాలు ఉన్నాయి. ఇలా ఒకేసారి ఆకాశంలో రెండు సూర్యుళ్లు ఉదయించడం సంభవమేనా?
- ఎం.జగన్మోహన్రెడ్డి, హన్మకొండ, వరంగల్
జవాబు : మతతత్వ రాజకీయాలకు శాస్త్రీయ మద్దతును మోస పూరితంగానైనా ఆపాదించడానికి ఈమధ్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రజల ఆలోచనల్ని సనాతన భావాల వైపునకు, మూఢ విశ్వాసాల వైపునకు మరింత చేరువయ్యేలా ప్రయత్న పూర్వకంగానే కొందరు సైబర్ స్పేస్ (మీడియా)లో శాస్త్రీయ దృక్పథంపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారు. 'దున్నపోతు ఈనిందంటే దూడను గుంజకు కట్టేయండ'ి అని ఎవరో జవాబిచ్చినట్టుగా- ప్రజలు రెండో ఆలోచన లేకుండా నమ్మేస్తున్నారు. అంతోయింతో ఖగోళ పరిజ్ఞానం వున్నవారు కూడా కనీసం ప్రశ్నించకుండా మూఢనమ్మకంలో పడిపోతున్నారు. ఇలాంటి వారే గతంలోనూ విమానాలుండేవని, పుష్పక విమానం అలాంటిదేనని, గతంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉండేదని, గజాననుడి కథే ఇందుకు ఉదాహరణ అని రకరకాల కథలు చెబుతున్నారు. ఈమధ్య మీడియాలో బాహాటంగా, నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా ఓ ఆధునిక వస్త్రధారిత సన్యాసి గోపురాల శిఖరాలకు, విద్యుత్ స్తంభాల రూపాలకు లంకెవేసి రాజుల కాలంలోనే విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా వుండేదని, పిడుగులు పడకుండా కాపాడేందుకు ధ్వజస్తంభా లను నిర్మించారని వల్లె వేశాడు. ఇలాంటివి ఈ మధ్య పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. అదలా వుంచుదాము.
మన సౌర కుటుంబంలో ఒకే ఒక సూర్యుడు ఉన్నాడు. ఉన్నట్టుండి రెండో సూర్యుడు రావడానికి అవకాశం లేదు. ఒకవేళ ఊహ ప్రకారం ఈ వాట్సాప్ కబుర్లు నిజమేనని అనుకుందాం. అలాంటపుడు సంభవించే విపత్పరిణామా లేమిటో తెలుసుకుందాం...
1. ఇద్దరు సూర్యుళ్లులో ఏ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది? ఒకవేళ ఉన్నఫళాన ఇద్దరు సూర్యుళ్ల పట్ల సమాన గౌరవంతో ఇద్దరి చుట్టూ ఒకేసారి తిరిగినట్లయితే భూమి కదలికలో ఉన్నట్టుండి మార్పు వచ్చేది. ఓ కుదుపు వచ్చేది. ప్రపంచం మొత్తం ఇప్పటికే ఆ ప్రళయాన్ని రుచి చూసేది. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి రెండో సూర్యుడు అబద్దం.
2. ఒకేసారి ఇద్దరు సూర్యుళ్ల వల్ల కలిగే గురుత్వాకర్షణ బలాన్ని అధిగమించాలంటే భూ పరి భ్రమణం వల్ల కలిగే అప కేంద్ర బలం (షవఅ్తీఱటబస్త్రaశ్రీ టశీతీషవ) కూడా రెండురెట్లు కావాలి. అది పరిభ్రమణ వేగం 40 శాతం పెరగడం వల్ల గానీ లేదా భూమికి, సూర్యుళ్లకు మధ్య దూరం ఇప్పుడున్న దూరంకంటే సగానికి తగ్గడంవల్ల గానీ వీలవుతుంది. లేదా రెండు విధాలుగా మార్పులు జరిగి అప కేంద్ర బలాన్ని రెండు రెట్లు పెరిగిన గురుత్వాకర్షణ బలానికి సమ ఉజ్జీగా చేసుకో గలగవచ్చు. అలాంటప్పుడు కోణీయ ద్రవ్య వేగాన్ని (aఅస్త్రబశ్రీaతీ ఎశీఎవఅ్బఎ) నిత్యత్వం (షశీఅరవతీఙవ) చేసుకోవాలంటే భూ భ్రమణం (జుaత్ీష్ట్ర ూజూఱఅ) లో కూడా మార్పులు రావాలి. అంటే 24 గంటలు బదులు అంతకన్నా చాలా తక్కువలోనే ఒకరోజు వుండాలి. అంటే 8 గంటలు మాత్రమే పగలు 8 గంటలు మాత్రమే రాత్రి వుండాలి. గడియారాల డయలును మనమిక 12 గంటల బదులు ఏ ఎనిమిదో తొమ్మిదో చుక్కలు ఉండేలా చూసుకోవాలి. భూమి భ్రమణ వేగం పెరగడం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు జరిగేవి. అలాంటివి ఏమీ జరగలేదు. కాబట్టి రెండు సూర్యుళ్ల కథ కల్పిత కథ.
3. ఇక అసలు విషయం. ఇద్దరు సూర్యుళ్లు ఉన్నట్లయితే అమెరికాలో ఉదయం అయితే మరో చోట ఎక్కడో (ఉదాహరణకు ఆఫ్రికా, ఐరోపాలో) మధ్యాహ్నం అయి వుంటుంది. ఒక సూర్యుడికే మధ్యా హ్నం ఒళ్లు కాలుతుంటే, మధ్యాహ్నం పూట రెండు సూర్యుళ్లు ఉన్నట్లయితే అక్కడ జీవజాతులు మొత్తం మాడి మసి అయిపోయేవి. కాసేపటికి అమెరికాలో మధ్యాహ్నం అవుతుంది. అక్కడ మసి. కొన్ని గంటల తర్వాత ఆసియాలో. అక్కడా మసి. అంటే 24 గంటలు తిరక్కముందే ప్రపంచంలో అన్ని సెలయేళ్లు ఎండిపోయేవి. జీవరాశులు నశించేవి. అలాంటి ఘోరం ఏమీ జరగలేదు కాబట్టి రెండు సూర్యుళ్ల ప్రచారం దుష్ప్రచారం. ఓ ఆరు గంటల ముందు మన దేశంలో మిట్ట మధ్యాహ్నం అయి వుండేది కాబట్టి ఇప్పటికే మీతోపాటు మేము అందరం చెట్టూ పురుగు పుట్రాతో
సహా భస్మీపటలం అయి వుండేవారము. ఎందుకంటే అమెరికాలో ఆదివారం ఉదయం అయితే అదే సమయంలో మనకు దాదాపు సాయంత్రం. అంటే అమెరికాలో ఉదయంగా కనిపించడానికి సుమారు 6 గంటల మునుపు మనకు ఆదివారం మధ్యాహ్నం అయి వుంటుంది.
మరో మాటలో చెప్పాలంటే అమెరికాలో ఆదివారం తెల్లవారకముందే మన దేశంలో ఆరు గంటల ముందే మన బతుకులు తెల్లవారిపోయి వుండేవి. కాబట్టి ఆ విధంగా చూసినా ఈ వాట్సాప్ కథకుల తెలివి తెల్లవారినట్టే వుంది.
ఇలా ఎన్నో విధాలుగా రెండు సూర్యుళ్ల ప్రచారాన్ని శాస్త్రీయ ఆధారాలతో కొట్టిపారేయగలము. ఇలాంటి ప్రచారాల్ని నమ్మడమంత మూర్ఖత్వం మరోటి వుండదు. మరి ఎందుకిలా కనిపించింది. కన్పించడం కూడా అవాస్తవమేనా? అలా కనిపించడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి- కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా మిధ్యా చిత్రాన్ని ప్రచారం చేయడం. రెండు- ఎపుడో సంభవించే సూర్యుడు, చంద్రుడు ఒకేసారి పూర్ణమి నాడు ఆకాశంలో ఎదురెదురుగా ఉండడం. మొదటి పద్ధతిలో దేన్నైనా ఈ రోజుల్లో చేయగలం కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. రెండోది జరగాలంటే ఉదయపు సూర్యుడి బింబం, తూర్పున అస్తమించే చంద్రుడి బింబం (లేదా అటూయిటూ) పడమర ఉండే అవకాశం కొన్ని ప్రాంతాల్లో వుంటుంది. కొన్ని నిమిషాల తర్వాత ఏదో ఒకటి అస్తమిస్తుంది. ఆ క్షణంలో ఆ చంద్రుడ్నే మరో సూర్యుడిగా భ్రమించే అవకాశం వుంది. ఇలాంటి చంద్రుణ్ణి వెంబడించే చంద్రుడు (నబఅ్ఱఅస్త్ర వీశీశీఅ) అంటాము.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
Authorization