ఒకప్పుడు చిత్రలహరి ప్రోగ్రాం వచ్చే సమయానికి ఊర్లో వాళ్ళంతా టీవీ ముందు చేరేవారు. ఆ రోజుల్లో ఊరికి ఒకటి రెండు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. ఆ కాలంలో అవి
గొప్ప. ఊరంతా ఒక్క చోట చేరి అరగంట ప్రసారమయ్యే ఆ ప్రోగ్రాంను మిస్ అయ్యే వాళ్ళు కాదు. కానీ రోజురోజుకు టెక్నాలజీ మారుతోంది. కలర్ టీవీలు ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీలు ఇలా మార్పు చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి. అందులోనూ ఎల్సీడీ టీవీనే వినియోగించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. పిక్చర్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ, ఎక్కువ లైటింగ్, సైజ్‌లలో చిన్నవి పెద్దవి అని ఇలా ఏదోక మార్పులతో రోజురోజుకు టీవీలు ఆధునికతను
జోడించుకుని అందుబాటులోకి వస్తున్నాయి. ఏయే సౌకర్యాలు ఉంటే బెటర్, ఒకే తరహా టీవీలకు వేర్వేరు ధరలు ఎందుకుంటున్నాయి, మన అవసరానికి తగినట్లుగా ఎలాంటి టీవీని ఎంచుకోవాలనే విషయాలు తెలుసుకుందాం..
సాధారణ టీవీలు, స్మార్ట్ టీవీలు, ఫుల్ స్మార్ట్ టీవీలు అని వేర్వేరు రకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఎల్ఈడీ టీవీలు తక్కువ ధరలో, అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పరిమాణం, అందులోని సదుపాయాలను బట్టి.. ఏడెనిమిది వేల రూపాయల నుంచి మూడు లక్షల వరకు లభిస్తున్నాయి. 21 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు.. హెచ్డీ రెడీ నుంచి 8కె వరకు వివిధ రిజల్యూషన్లలో లభిస్తున్నాయి. మార్కెట్లో ఎల్ఈడీ టీవీలు విక్రయించే కంపెనీలు.. వివిధ పేర్లతో, వివిధ ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.ఎల్ఈడీల్లో రకాలు.. ఎల్ఈడీ, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ వంటివి అందుబాటులో ఉంటాయి.
ఎల్ఈడీ
ఎల్ సీడీ (లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే) టెక్నాలజీని ఆధునీకరించినవే ఎల్ఈడీలు. దీనిని ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ సీడీగా చెప్పవచ్చు. సాధారణంగా ఎల్సీడీ డిస్ప్లేలలో కాంతిని ఉత్పత్తి చేయడానికి ఫ్లోరోసెంట్ లైట్లను వినియోగిస్తారు. ఇవి అన్ని రంగులను చూపగలిగినా ఎక్కువ ప్రకాశవంతంగా ఉండవు. విద్యుత్ వినియోగం ఎక్కువ. పరిష్కారంగా ఎల్సీడీ డిస్ప్లేలలో ఎల్ఈడీ బల్బులను వినియోగించారు. దీని వల్ల కాంతి ఉత్పత్తి పెరుగుతుంది. మిగతా డిస్ప్లే అంతా కూడా పాత టెక్నాలజీయే. ఈ టెక్నాలజీని ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్సీడీ అంటారు. ప్రకాశవంతంతో పాటు రంగులనూ బాగా చూపగలవు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉఉంటుంది. డిస్ప్లే గట్టిగా ఉండడంతో ఎక్కువ కాలం మన్నుతాయి. ధర అందుబాటులో ఉంటుంది.
ఓఎల్ఈడీ..
ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్ కార్బన్ ఆధారిత ఎల్ఈడీలతో తయారు చేస్తారు. విద్యుత్ సరఫరా చేసినప్పుడు ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను వెదజల్లుతాయి. వీటికి ఎల్‌సీడీకి సంబంధించిన ప్యానల్ కాకుండా లక్షల సంఖ్యలో ఓఎల్ఈడీలను పక్కపక్కన అమర్చుతారు. దీని వల్ల మెరుగైన చిత్ర నాణ్యత, ప్రకాశవంతమైన వెలుగును వెదజల్లుతాయి. వీటిలో వేగంగా మారిపోయే స్పోర్ట్స్, గ్రాఫిక్స్లను చాలా స్పష్టంగా చూసేందుకు వీలుంటుంది. ఇందులో వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. అందువల్ల డిస్ప్లేను ఏ వైపు నుంచి చూసినా దశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిల్లో అత్యాధునికమైన రకాల డిస్ప్లేలను చుట్ట చుట్టడానికి వీలుగా తయారు చేస్తున్నారు. వీటికి విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. వీటి జీవితకాలం తక్కువ. కానీ ధర చాలా ఎక్కువ కావడంతో వీటి వినియోగం తక్కువగా ఉంటుంది.
క్యూ ఎల్ఈడీలు..
ప్లాస్మా, ఓఎల్‌ఈడీలతో సమానంగా దశ్య నాణ్యత, ప్రకాశంతమైన డిస్ప్లేలు కలిగి ఉంటాయి. సాధారణ ఎల్ఈడీ టీవీలు, ప్లాస్మా టీవీల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటాయి. డిస్ప్లే కూడా పలుచగా ఉంటుంది. వీటి ధర సాధారణ ఎల్ఈడీల కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. వీటిలో దేని ఎంపిక ఉత్తమం అంటే.. వాటి పరిమాణాలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. నాణ్యత పరంగా ఎల్ఈడీల కంటే ఓఎల్ఈడీలు కొనడమే ఉత్తమం. కానీ వీటి జీవితకాలం కొంత తక్కువగా ఉండడంతో అనాసక్తి చూపిస్తున్నారు.
సైజు, రిజల్యూషన్ బట్టి ధర
టీవీల డిస్ప్లేను ఐ మూలగా (డయాగల్)గా కొలిస్తే వచ్చే పరిమాణాన్ని, దాని సైజుగా లెక్కిస్తారు. ఎత్తు, వెడల్పును బట్టి లెక్కించరు. పెద్ద పెద్ద టీవీలు ఇప్పుడు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇందులో పిక్చర్, సౌండ్ క్వాలిటీని బట్టి ధరలు ఉన్నాయి. మనం టీవీని పెట్టుకునే గది పరిమాణం, కూర్చుని చూసే దూరాన్ని బట్టి సైజును ఎంచుకోవాల్సి ఉంటుంది. గది చిన్నగా ఉండి, టీవీ సైజు పెద్దగా ఉంటే కంటి చూపు దెబ్బతింటుంది. గది పరిమాణం పెద్దగా ఉండి, దూరంగా కూర్చుని చూస్తే దృశ్యాలు సరిగా కనపడవు.
రిజల్యూషన్లు అంటే..
హెచ్డీ రెడీ, హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కె, 8కె వంటి రిజల్యూషన్లతో టీవీలు అందుబాటులో ఉన్నాయి. రిజల్యూషన్ పెరిగిన కొద్దీ టీవీల్లో దశ్య నాణ్యత, వాటి ధర పెరుగుతూ పోతుంది. ఏ దశ్యమైనా చుక్కలు, చుక్కలుగానే ఉంటుంది. అన్నీ కలిస్తేనే దశ్య రూపకంగా కనిపిస్తుంది. దీనినే రిజల్యూషన్ అంటారు. ఈ చుక్కలు ఎంత దగ్గరగా, ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్నట్టు. ఎంత ఎక్కువ రిజల్యూషన్ ఉంటే.. దశ్య నాణ్యత అంత ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్, అవసరాన్ని, టీవీ పెట్టుకునే గది పరిమాణాన్ని బట్టి ఏ రిజల్యూషన్ ఉన్న టీవీని ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
టీవీల్లో తేడాలు..
మార్కెట్లో ఎన్నో కంపెనీల టీవీలు లభిస్తాయి. ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో టీవీలను విక్రయిస్తుంటుంది. రిజల్యూషన్, సైజ్ వంటి సదుపాయాలను బట్టి వాటి ధరలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రధానంగా సాధారణ ఎల్ఈడీ టీవీలనే స్మార్ట్ టీవీలు అంటారు. కేవలం కేబుల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ ద్వారా వివిధ చానళ్లను చూసుకోవచ్చు. పెన్‌డ్రైవ్, హార్డ్‌డ్రైవ్, మెమరీ కార్డులను వినియోగించేలా యూఎస్బీ పోర్టులు ఉంటాయి. ఇంటర్నెట్, వైఫై వంటి సదుపాయాలేమీ వీటిలో ఉండవు. క్రోమ్ క్యాస్ట్, అమెజాన్ ఫైర్ స్టిక్ వంటి పరికరాల ద్వారా సాధారణ ఎల్ఈడీ టీవీల్లోనూ 'స్మార్ట్' టీవీల్లో ఉండే సదుపాయాలను పొందవచ్చు. వీటిని విడిగా కొనుగోలు చేసుకుని, తగిన సూచనల మేరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
స్మార్ట్ టీవీలు
స్మార్ట్ టీవీ అనగానే పూర్తి సౌకర్యాలు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ స్మార్ట్ టీవీల్లో కొన్ని ప్రాథమిక సదుపాయాలు మాత్రమే ఉన్న వాటిని ఇంటర్నెట్ టీవీలుగా పిలుచుకోవచ్చు. వీటిలో ఇంటర్నెట్ వినియోగానికి వీలుగా వైఫై, బ్లూటూత్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇన్‌బిల్ట్‌గా ఇంటర్నెట్ బ్రౌజర్, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి కొన్ని యాప్స్ అందులో ఉంటాయి. వేరేవి ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఇందులో ఫోన్లోని వీడియోలు, ఫొటోలు, ఇతర డేటాను నేరుగా టీవీ తెరపై వీక్షించేందుకు వీలవుతుంది. ఫుల్ స్మార్ట్ టీవీలలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలతో పాటు స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని రకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల స్మార్ట్ టీవీలను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయడానికి వీలు ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీపై చూడగలిగేలా స్క్రీన్ మిర్రరింగ్, మీరా కాస్ట్ సదుపాయాలు ఉంటాయి.ఇలా అనేక రకాల ఎల్ఈడీ టీవీలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరి అవసరాన్ని బట్టి, సరిపోయేది నిర్ణయించుకుని కొనుగోలు చేసుకోవచ్చు.
Authorization