ప్రశ్న : చీమలు ఒకదాని వెనుక ఒకటి క్యూలో వెళ్తున్నట్లు వెళ్తాయి. వాటికి అంత గొప్ప క్రమశిక్షణ ఉందా?
- సిహెచ్.శ్రీహర్షిత, షైన్ ఉన్నత పాఠశాల,వరంగల్
జవాబు : చీమలు సామూహిక జీవులు (Colonised animals). ఒంటరిచీమ, ఎక్కువ కాలం ఉండదు. అందుకే వాటిని సాంఘిక కీటకాలని (Social Insects) కూడా అంటారు. చీమలు చాలా రకాలు. దాదాపు 22 వేల రకాల జాతులున్నట్లు అంచనా. ఒక చీమల సంఘంలో జన్యుస్మృతి ప్రకారం 3 రకాలుంటాయి.
ఒకటి : రాణి . ఇవి సాధారణంగా తక్కువగా ఉంటాయి. వీటి కణాల్లో పూర్తి క్రొమోజోములు(Diploid) వుంటాయి. ఇవి పెట్టే గుడ్లలో సగం క్రొమోజుములుంటాయి.
రెండు: జంట క్రోమోజోము సేవకులు (Diploid Workers): వీటి కణాల్లో పూర్తి క్రోమోజోములు ఉంటాయి. ఇవి కూడా గ్రుడ్లు పెడతాయి. అయితే ఈ గ్రుడ్లలో సగం క్రొమోజోములే (haploid) ఉంటాయి. ఇవి సరాసరి పొదిగి సగం క్రొమోజోములున్న సేవకుల్ని ఇస్తాయి.
మూడు : ఒంటరి క్రొమోజోము సేవకులు (Haploid Drones) : వీటి కణాల్లో జతకట్టని సగం క్రొమోజోములు ఉంటాయి. పక్వ దశలో ఇవి మైటాసిస్ అనే సాధారణ కణ విభజన ద్వారా సగం క్రొమోజోములున్న శుక్రకణాల్ని (Sperms) ఇస్తాయి. ఈ శుక్రకణాలు రాణి చీమలు విడుదల చేసిన సగం క్రొమోజోములున్న గ్రుడ్లతో ఫలదీకరణం చెందుతాయి. తద్వారా పుట్టే చీమల్లో కొన్ని రాణి చీమల్లాగా మారగలవు. ఎక్కువ భాగం జంట క్రొమో జుములున్న సేవకులుగా పుడతాయి. రాణి పెట్టిన గ్రుడ్లలో సగం క్రొమోజోములున్న వాటిలో కొన్ని ఫలదీకరణం చెందనట్లయితే అవి నేరుగా సగం (ఒంటరి) క్రొమోజోములున్న మూడో తరగతి సేవకులు (Haploid Drones) గా మారతాయి.
సేవక క్రొమోజోముల్లో కొన్ని అటూఇటూ తిరుగుతూ ఆహారానికి దొరికే పదార్థాలను పసిగడతాయి. వీటికి అద్భుతమైన ఘ్రాణశక్తి (వాసన చూసే సామర్థ్యం) ఉంది. అంతేకాదు, అవి దారివెంట ఫార్మిక్ ఆమ్లపు (HCOOH) బిందువుల్ని నేలమీద గుర్తింపు చిహ్నాలు (tracers)గా వదుల్తూ వెడతాయి. అవి ఆహారం దొరికాక తిరిగి తమ తోటి చీమల సేవకుల్ని వేగిరపర్చి నడిపిస్తాయి. ఒక చీమ వదిలిన ఫార్మిక్ ఆమ్లాన్ని వెనుక చీమ, వెనుక చీమ వదిలిన ఫార్మిక్ ఆమ్లాన్ని ఆ వెనుక చీమ వాసన చూస్తూ ఒకదాని వెంట ఒకటి వెళతాయి. అంతేగానీ కంటితో చూసికాదు. అందుకే మనం చీమల దండు మధ్యలో ఏదైనా పుల్లతో ఫార్మిక్ ఆమ్ల చిహ్నాల్ని చిదిమేస్తే ఆ చీమలన్నీ చెల్లాచెదరు కావడాన్ని గమనించగలం.
Authorization