అసలే వేసవికాలం.. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు. వేసవి విడిది కోసం కుటుంబంతో సరదాగా హాలిడే గడపడానికో, అమ్మమ్మ, నాయనమ్మ ఇండ్లకు ఇలా ఏదోక రకంగా ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎక్కువ మంది రైళ్ళకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా దూర ప్రయాణాలైతే చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లో కంటే రైళ్ళలో ఇపుడు రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఒకొకసారి వెయిటింగ్ లిస్ట్ తక్కువగా ఉండి, ప్రయాణం చేయాల్సిన తేదీకి ఎక్కువ గడువు ఉంటే.. ఆర్ఏసీ అయినా కన్ఫార్మ్ అవుతుందనే ధీమాతో టికెట్ బుక్ చేసుకుంటార. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటింగ్ లిస్ట్ తగ్గకపోతే ఆర్ఏసీ కూడా కన్ఫర్మ్ అవ్వదు. కొందరు టూర్ ప్లాన్ చేసుకున్నాక అనుకోని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి అనుకున్న సమయం కంటే ముందే బయలుదేరాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి. టికెట్టు డబ్బులు వదులుకోవాల్సిందేనా..? ప్రత్నామ్నాయం ఏం లేదా? అంటే.. ఐఆర్సీటీసీ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు కల్పిస్తోంది. రైలు టికెట్ల ప్రయాణ తేదీలను మార్చుకునే సౌకర్యం అందిస్తోంది. అలాగే దిగాల్సిన స్టేషన్ వచ్చినా అదే రైలులో తర్వాతి స్టేషన్ వరకు ప్రయాణించే అవకాశాన్ని అందిస్తోంది. ఎక్కాల్సిన స్టేషన్ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. అలాగే టికెట్లను హైయర్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే వీటిల్లో ఎక్కువ సేవలు ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్ ద్వారా మాత్రమే పొందే అవకాశం ఉంది.
ప్రయాణించాల్సిన తేదీని ముందుకు వెనక్కు జరుపుకోవాలంటే.. రైల్వే కౌంటర్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముందుకు జరపాలనుకుంటే.. బుక్ చేసుకున్న రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లి బుకింగ్ చేసుకున్న టికెట్లలలో తేదీలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వెనక్కు జరుపుకోవాలనుకుంటే.. ఆ రైలు సమయానికి 48 గంటల ముందే మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.
దిగాల్సిన స్టేషన్ కాకుండా తర్వాత వచ్చే స్టేషన్ వరకు వెళ్ళాల్సి ఉంటే.. టికెట్ చెకింగ్ స్టాఫ్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. ఎక్కాల్సిన స్టేషన్ మార్చుకోవాలంటే స్టేషన్ మాస్టర్ లేదా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్లో రిక్వెస్ట్ లెటర్ అందించాలి. జర్నీకి 24 గంటలకు ముందు ఈ ప్రక్రియ పూర్తి కావాలి.
టికెట్ కన్ఫార్మ్ అయ్యాక హైయర్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే.. ఆ క్లాస్‌లో అందుబాటులో ఉన్న సీట్లపై ఆధారపడి ఉంటుంది. చార్జీలు, టికెట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసానికి తగిన డబ్బు చెల్లిస్తే అప్‌గ్రేడ్ పూర్తవుతుంది. ఇందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సంప్రదిస్తే సరిపోతుంది.
Authorization