ఆండ్రాయిడ్.. ప్రస్తుతం ఈ పేరును ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 88 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. 2008లో ప్రారంభమైన ఆండ్రాయిడ్ల ప్రస్థానంలో ఇప్పటి వరకు 10 వర్షెన్లు వచ్చాయి. ఒక్కో దానికి ఒక్కో పేరును గూగుల్ నిర్ణయించింది. ప్రస్తుతం ఇందులో వచ్చిన 10 క్యూ బీటా విశేషాలు ఒకసారి చూద్దాం..
ఆండ్రాయిడ్ అనేది ప్రత్యేకతగాంచిన ఆపరేటింగ్ సిస్టమ్ (OS). ఆండ్రాయిడ్ అంటే మనిషిలా కనిపించే రోబో అని అర్థం. అందుకే ఈ సాఫ్ట్‌వేర్‌కు ఆ పేరును పెట్టారు. దీనిని ఆండీ రూబిన్ అనే వ్యక్తి రూపొందించాడు. ఆయనకు రోబోలంటే ఎంతో మక్కువ. వాస్తవానికి ఫోన్ కోసం ఈ సాఫ్ట్వేర్ తయారు చేయాలని ఆండీ రూబిస్ అనుకోలేదు. కెమెరాల్లో ఉన్న ఫోటోలను కంప్యూటర్లోకి ఎక్కించడానికి ఈ సాఫ్ట్వేర్ తయారు చేశారు. కానీ ఫోన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌గా మారి ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుందని అతను ఊహించలేదు. ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ సంస్థకు చాలా తక్కువకు అమ్మేశాడు. ఆ తర్వాత నుంచి గూగుల్ ఇందులో అప్డేట్స్ చేసుకుంటూ ఇప్పటివరకు 10 వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఆల్ఫాబెటికల్ క్రమంలో..
మొదటి వెర్షన్ నుంచి ఈ ఆండ్రాయిడ్‌కు పెట్టిన పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పటివరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ల పేర్లన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జె, కె, ఎల్, ఎమ్, ఎన్, ఓ, పి ఇలా వరుస క్రమంలో ఉన్నాయి. మొదటి వెర్షన్‌కు ఆస్ట్రో బారు అని సరదాగా పెట్టిన పేరుతో ప్రారంభమై కప్‌కేక్, డోనట్, ఎక్లయర్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్విచ్, జెల్లీబీన్, కిట్‌కాట్, లాలీపాప్, మార్ష్మల్లావ్, నోగాట్, ఓరియో, పై ఇలా పెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం వచ్చిన వెర్షన్‌కు కూడా క్యూ అని పెట్టింది. ప్రతి వెర్షన్లోనూ ఫీచర్లను అప్డేట్ చేసుకుంటూ వస్తోంది.
వర్షెన్లు
2007లో వెర్షన్లు ప్రారంభమైనప్పటికి మొదట వచ్చిన 1.0, 1.1లు ఎలాంటి కోడ్‌తో రిలీజ్ చేయలేదు. వీటికి ఆల్ఫా, బీటా వెర్షన్లుగా పేర్లు పెట్టారు. కానీ 2009 నుంచి విడుదల చేసిన ఫోన్లలో ఆండ్రాయిడ్ 1.5కు కప్‌కేక్, 1.6కు డోనట్, 2.0కు ఎక్లెయిర్, 2.2కు ఫ్రోయో, 2.3కు జింజర్ బ్రెడ్, 3.0కు హనీకోంబ్, 4.0కు ఐస్‌క్రీమ్ శాండ్విచ్, 4.1 నుంచి 4.3.1 వరకు జెల్లీ బీన్, 4.4 నుంచి 4.4.4 వరకు కిట్‌కాట్, 5.0 నుంచి 5.1.1 వరకు లాలీపాప్, 6.0 నుంచి 6.0.1 వరకు మార్ష్మల్లావ్, 7.0 నుంచి 7.1 వరకు నొగాట్, 8.0 - 8.1 కు ఓరియో, 9.0 కు పై అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం వచ్చిన ఓఎస్ ఫీచర్‌కు 10 క్యూ బీటా అని పేరు పెట్టారు.
టాప్ ఫీచర్స్...
ఈ మధ్యనే గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 10 క్యూ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ప్రయాణంలో గూగుల్ వేసిన 10వ అడుగు ఇది. ఈ వెర్షన్ ఇప్పటికే కొన్ని ఫోన్లకు అప్డేట్ కూడా వచ్చేస్తోంది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్స్ స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్, లైవ్ క్యాప్షన్, డిజిటల్ వెల్బీయింగ్, డార్క్ థీమ్ లాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ఆండ్రాయిడ్ క్యూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
బ గతేడాది రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌లో డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ ఉంది. స్క్రీన్ టైమ్‌ని తగ్గించడానికి ఉపయోగపడే ఈ ఫీచర్లో మరి కొన్ని ఫీచర్లను కలిపింది. దీనితో పాటు వినియోగదారులు కొన్ని యాప్స్‌ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఇలా చేస్తే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ కాకుండా నిలువరించవచ్చు.
- ఫోన్లో ఉన్న వీడియో ప్లే అయ్యేప్పుడు లైవ్ క్యాప్షన్ ఆటోమెటిక్‌గా జెనరేట్ అవుతుంది. యూట్యూబ్ వీడియో అయినా, వీడియో కాల్, పాడ్ క్యాస్ట్, వాయిస్ మెసేజ్... ఇలా ఏవైనా అయినా లైవ్ క్యాప్షన్ ఫీచర్ పనిచేస్తుంది.
- ఇందులో 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, 5జీని సపోర్ట్ చేసే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇదే. 5జీ సపోర్ట్ చేసే యాప్స్ తయారు చేసేందుకు కావాల్సిన టూల్స్‌ని డెవలపర్లకు గూగుల్ అందించనుంది.
- ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో ఇపుడు ప్రైవసీ ఆప్షన్లు ఎక్కువగా కనిపించనున్నాయి. దీని వల్ల ఏ లొకేషన్లో ఉన్నామనే విషయం, పర్మిషన్లకు సంబంధించి వినియోగదారులకు మరింత పట్టు ఉండే అవకాశం ఉంది.
- డార్క్ థీమ్ ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా సైట్లలో వస్తోన్న ఫీచర్. ఇందులో ఫోన్ మొత్తానికి డార్క్థీమ్ను సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీని చాలా ఆదా చేస్తుంది. ఓలెడ్ స్క్రీన్స్ ఉపయోగించే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
- మెషీన్ లెర్నింగ్ ఫీచర్స్‌ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మెసేజింగ్ యాప్స్‌లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్ ఫీచర్ వాడుకోవచ్చు. అంటే వచ్చిన మెసేజ్ కంటెంట్‌ను అర్థం చేసుకొని అందుకు కావాల్సిన రిప్లైని సజెస్ట్ చేస్తుంది గూగుల్. ఉదాహరణకు మీకు మెసేజ్‌లో ఎవరైనా అడ్రస్ పంపిస్తే... డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్‌లో మీకు ఆ అడ్రస్ కనిపిస్తుంది.
-ఈ మధ్య కాలంలో మొబైల్ తయారీ కంపెనీలు ఫోల్డబుల్ డివైజ్‌లపై దష్టి పెట్టాయి. ఆండ్రాయిడ్ క్యూ అలాంటి డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది.
అప్డేట్ లభించే ఫోన్లు...
Asus ZenFone 5Z, Essential PH-1, Nokia 8.1, Huawei Mate 20 Pro, LG G8 ThinQ, OnePlus 6T, Oppo Reno, Realme 3 Pro, Sony Xperia XZ3, Tecno Spark 3Pro, Vivo X27, Vivo NEX S, Vivo NEX A, Xiaomi Mi Mix 3 5G, Xiaomi Mi 9 లలో అందుబాటులో ఉంది. మీ దగ్గర ఈ స్మార్ట్ఫోన్లు ఉంటే మీరు ఆండ్రాయిడ్ క్యూ బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ ఎలా..
ఆండ్రాయిడ్ క్యూ బీటా వెర్షన్ గూగుల్ ఫోన్లల్లో లభిస్తుంది. దాంతో పాటు 15 పార్ట్నర్ డివైజ్‌లల్లో కూడా ఆండ్రాయిడ్ క్యూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. నాన్-గూగుల్ ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్సైట్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్సైట్లోకి వెళ్లాక స్క్రోల్ డౌన్ చేసి మీ దగ్గర ఉన్న ఫోన్ ఏదో చూడండి.'Get the Beta' బటన్‌పైన క్లిక్ చేయండి. మీరు ఎన్రోల్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం కొన్ని ఫోన్లల్లో మాత్రమే ఆండ్రాయిడ్ క్యూ బీటా లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ఫోన్లకు ఆండ్రాయిడ్ క్యూ లభించనుంది.
Authorization