శభ్రత.. ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చే అంశమే.. పాటించకుంటే సుస్తీ తప్పదు. మనుషులకైనా.. వస్తువులకైనా.. బాహ్యంగా కనిపిస్తున్నంత వరకు పర్వాలేదు.. మరి అంతర్గతంగా చేయాల్సిన శుభ్రత పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం రోజూ ఉపయోగించే వస్తువుల గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఇతర గాడ్జెట్స్లను నిత్యం ఉపయోగిస్తుంటాం. పైకి కనిపించినంత మేర వాటిని బాగానే శుభ్రం చేస్తుంటాం. ఇలా చేయడం ప్రతిదానికి సరైనది కాదు కూడానూ. వస్తువును బట్టి క్లీనింగ్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగించి వేటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవచ్చు.. వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్లు లేదా బ్యాక్టీరియాలను ఎలా నివారించుకోవచ్చు అనేది తెలుసుకుందాం..
టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. రెండు దశాబ్దాల కాలంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏమీ తోచని పరిస్థితికి చాలా మంది చేరుకున్నారు. రోజువారీ పనులకు కూడా స్మార్ట్ఫోన్లపై ఆధార పడుతున్నాం. ఆఫీసుల్లో కంప్యూటర్లు లేకపోతే పని సాగనంతగా ఆధార పడిపోయాం. ఒక రోజులో స్మార్ట్‌ఫోన్, కీబోర్డు వంటి వాటిని ప్రెస్ చేసే సంఖ్య వేలల్లో ఉంటుంది. మొత్తానికి రోజంతా లెక్కలోకి తీసుకుంటే ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, ఇతర గాడ్జెట్స్ ఇలా ఏదో ఒక వస్తువును ఉపయోగిస్తూనే ఉంటున్నాం. మరి అన్ని సార్లు మనం టచ్ చేసే ఫోన్, కీ బోర్డు బటన్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పగలమా? వాటిపై చాలా రకాల బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. వీటి వల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువనే చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలను పైకి కనిపించే భాగాలలో మెత్తని క్లాత్‌తో శుభ్రం చేస్తుంటాం. అన్నింటికీ మెత్తని క్లాత్ సముచితమేనా అంటే.. కాదని కచ్చితంగా చెప్పవచ్చు. కొన్ని రకాల వస్తువులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆయా వస్తువుల కోసం ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి.
అనారోగ్య కారకాలుగా..
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎక్కువగా ఉపయోగిస్తే వచ్చే అనారోగ్య సమస్యలు పక్కకు పెడితే.. మనం వెళ్ళే ప్రతి చోటుకు ఫోన్ తీసుకెళ్తుంటాం. వెళ్లిన ప్రదేశాన్ని బట్టి ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉంటుందా..? అంటే కచ్చితంగా ఔనని చెప్పలేం. మనం దాన్ని తాకినపుడు ఆ వైరస్లు మనకు మళ్లీ అంటుతుంటాయి కదా..! అంతేకాదు, మనకు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినపుడు మనం టచ్ చేసే కీబోర్డు, ఫోన్స్క్రీన్లు, మానిటర్, మౌస్, కంప్యూటర్ టేబుల్ వంటి వాటిపై ఆ వైరస్ ఉండిపోతుంది కదా.. మనం అనారోగ్యంగా ఉన్నపుడు ఏదైనా కాల్ వస్తే మాట్లాడి, అవసరాన్ని బట్టి ఫోన్ మాట్లాడమని ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకు కూడా ఇస్తుంటాం. వాతావరణంలో కొన్ని రకాల వైరస్లు 24 గంటలు సజీవంగానే ఉంటాయి. అంటే.. మనం వారిని తాకకున్నా, మన నుంచి వారికి వైరస్ సోకుతోందనే కదా అర్థం. ఈ కోవలోకే ఇ-కొలి వైరస్‌ను పరగణిస్తున్నారు. సాధారణంగా ఇది ప్రమాదకరమైనదని చెప్పకున్నా, ఇది స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగించి శుభ్రపరచకపోవడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉందని అంచనా. ఈ వైరస్ సోకితే జలుబు, వాంతులు, కడుపునొప్పి, డయేరియా, జ్వరం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇది ఎక్కువగా మనం ఉపయోగించే గాడ్జెట్స్ ద్వారా వ్యాప్తి చెందడానికి ఒక కారణం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందుకు కాలుష్యం ఒక కారణమైతే పనిచేసే చోట పేరుకుపోయి ఉన్న దుమ్ము మరో కారణం అవుతోంది. కండ్ల ముందు కనిపించే భాగాలు శుభ్రంగా ఉన్నప్పటికీ వెనుక భాగాల్లో ఎక్కువగా దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంటున్నాయి. వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చేయాల్సినవి..
ఎలక్ట్రానిక్ డివైజ్‌లను, గాడ్జెట్స్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చాలా రకాల పద్ధతులున్నాయి. ఇవి పాటిస్తే కొంత మేర శుభ్రంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. కంప్యూటర్ కీ బోర్డులను, గాడ్జెట్లను పైన మెత్తని క్లాత్‌తో తుడుస్తున్నప్పటికీ లోపలి భాగంలో ఎక్కువగా దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది. మొదట్లో అంత ప్రభావం కనపడకపోయినప్పటికీ కొంత కాలానికి దీని వల్ల సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. గాడ్జెట్స్ త్వరగా వేడెక్కడం ఇందులోని భాగమే. కీబోర్డులోని కీలు కూడా గట్టిగా అనిపిస్తాయి. కొన్ని కీలు పని చేయకుండా మొరాయిస్తాయి కూడానూ.
- కంప్యూటర్ సీపీయూలో హార్డ్‌డిస్క్, ర్యామ్, మదర్ బోర్డు, వైర్లు వంటివి చాలా సున్నితంగా ఉంటాయి. ఇందులో ప్రతి భాగం చాలా సున్నితమైనదే. ఇందులో రెండు ఫాన్లు తిరుగుతుంటాయి. ఈ కారణంగా చాలా రకాల చెత్త పేరుకుపోతూ ఉంటుంది. దీనిని వదిలించుకోవడానికి ఎయిర్బ్లోయర్ను ఉపయోగించడం మంచిది. తర్వాత మెత్తని క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తేనే అందులోని డస్ట్ పూర్తిగా శుభ్రమవుతుంది. అందులోని భాగాలకు సమస్య ఏర్పడదు.
- ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఎల్సీడీ మానిటర్ ఇలా ఏదైనా సరే స్క్రీన్లపై ఉండే దుమ్మూధూళిని శుభ్రం చేసుకుంటుంటేనే కండ్లకు స్పష్టంగా కనపడతాయి. ఈ స్క్రీన్లు శుభ్రంగా ఉంచుకోవడానికి స్క్రీన్వైప్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే ఉత్తమం.
- ఫోన్ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్స్‌తో పాటు ఇతర మరకలు పడుతుంటాయి. వీటిని నీటి చుక్కలు వేసి లేదా క్లాత్‌తో తుడవడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా స్క్రాచెస్ పడుతుంటాయి. స్క్రీన్ క్లీనింగ్ కోసం అనేక రకాల కిట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో ఉండే మైక్రో ఫైబర్ క్లాత్, లిక్విడ్లు ఉపయోగించి శుభ్రం చేస్తే మరకలు, బ్యాక్టీరియా వంటివి పోతాయి.
- కెమెరాలను ఎక్కువగా ఉపయోగించే వారు ఫొటో క్వాలిటీ కోసం ఈ మధ్య డీఎఎస్ఎల్ఆర్ కెమెరాలు వాడుతున్నారు. వీటిల్లో తరుచూ లెన్స్ మారుస్తూ ఉండడం వల్ల డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది. అలాగే వదిలేస్తే కొంత కాలానికి డివైజ్‌లు కలర్ మారిపోతుంటాయి. వీటి కోసం ప్రత్యేక బ్లోయర్లు ఉన్నాయి. కెమెరా లెన్స్ శుభ్రం చేయడానికి లెన్స్పెన్ ఉపయోగించుకుంటే ఉత్తమం. వీటితో పాటు బయోడిగ్రేడబుల్ కిట్ కూడా అందుబాటులో ఉంటోంది. ఇది డివైజ్‌లపై ఉన్న కంటికి కనిపించని క్రిములను చాలా వరకు నాశనం చేస్తుంది.
- వీటితో పాటు కీబోర్డు, మౌస్ కేబుల్స్, కంప్యూటర్‌కు సంబంధించిన వైర్లు అన్నింటినీ ఒక సారి నిశితంగా పరిశీలించుకుంటే అవి కూడా దుమ్ము పట్టి ఉంటాయి. వాటిని కూడా శుభ్రం చేసుకుంటే ఆరోగ్యాన్ని బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిముల బారి నుంచి కాపాడుకోవచ్చు.
Authorization