ఆన్లైన్ షాపింగ్.. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనది.. ఇపుడు పల్లెల్లో సైతం విస్తరించిన క్రేజ్.. ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా సెర్చ్ చేయడం.. ఎంపిక చేయడం.. బుక్ చేయడం.. ఈ పద్ధతి చాలా సులువుగా అనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని రకాల వస్తువులు బయట మార్కెట్ కంటే ఆన్లైన్లోనే తక్కువకు వస్తుండడం, ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు వర్తిస్తుండడంతో, చాలా వరకు ఈ వైపే మొగ్గు చూపిస్తున్నారు. కేవలం షాపింగ్లకే కాకుండా.. టికెట్ బుకింగ్‌లపై ఆఫర్లు, ఎక్కడికైనా ప్రయాణించాలంటే అవసరమైన వాహనాలు, కావాల్సిన ఆహార పదార్థాలు ఇంటికే పంపించే సంస్థలు రావడంతో ప్రపంచం మొత్తం ఆన్లైన్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినట్లయింది. ఈ తరహా సంస్థలు రూ. కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి. వినియోగదారులు సైతం ఇదే వెసులుబాటుగా భావిస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ విధానం సరైనదేనా అంటే అవునని చెప్పలేం కాదని చెప్పలేం.. ఈ తరహా షాపింగ్‌కు సంబంధించిన లోటుపాట్లు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..
వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించే షాపింగ్ ఆన్లైన్ షాపింగ్.. హెయిర్ పిన్స్ నుంచి ఇంట్లోకి అవసరమయ్యే సామాన్లు, ఒంటికి అవసరమైన ప్రతి వస్తువూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్, ఈబే వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఇలాంటి వాటికి కొదువే లేదు. ఒక్కో దానిలో ఒక్కో ధర. ఎందులో ఏ వస్తువు ఎంత ధర పలుకుతుందో డిస్కషన్లు చేసుకుని మరీ వస్తువులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా వస్తువుల కోసం బయటకు వెళ్ళి అక్కడా ఇక్కడా తిరగాల్సిన శ్రమ తగ్గుతుండడం, సమయం వృథా కాకపోవడం ఈ ఆన్లైన్ షాపింగ్‌కు క్రేజ్ పెరగడానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో లాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి వస్తువులు ఉంటూనే ఉన్నాయి. ఆన్లైన్లో కొనే ప్రతి వస్తువుకు ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఆయా బ్యాంకులను బట్టి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఏవైనా కంపెనీకి సంబంధించిన కూపన్లు అందిస్తున్నాయి. ఇలాంటివి వినియోగదారులకు లాభదాయకంగా అనిపిస్తుండడంతో ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇలా మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడం వల్ల సదరు వెబ్సైట్లు, సంస్థలకు వచ్చే లాభమేంటి అనే సందేహాలు కొందరికి ప్రశ్నలుగా మిగిలి ఉన్నాయి.
టెక్నాలజీతోనే..
ఒకప్పటితో పోలిస్తే టెక్నాలజీ వినియోగం సామాన్యులకు సైతం అత్యంత చేరువలో ఉంది. ఆన్లైన్ వ్యాపారం వచ్చాకే వ్యాపార రంగంలో పోటీ పెరిగింది. ఫుడ్‌కు సంబంధించిన సర్వీసులు తీసుకుంటే.. వినియోగదారులు సెలెక్ట్ చేసుకునే రెస్టారెంట్‌ను బట్టి కూపన్లు, డిస్కౌంట్లు ఉంటున్నాయి. ఒక యాప్ ద్వారా ఒక రెస్టారెంట్‌ను సెలెక్ట్ చేసుకుంటే సదరు రెస్టారెంట్ యాప్ నిర్వాహకులకు కనీసం 20 శాతం డిస్కౌంట్ అందిస్తుంటుంది. 20 శాతం డిస్కౌంట్ అంటే రూ.100లకు ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకుంటే వెబ్సైట్ చెల్లించాల్సినది రూ.80 మాత్రమే.. ఫుడ్ ఆర్డర్ చేస్తే తక్కువలో తక్కువ రూ.500 అయినా బిల్లు అవుతుంటుంది. ఈ లెక్కన ఒక రోజులో వేల మంది ఆర్డర్లు ఇస్తుంటారు. తద్వారా పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తుంటుంది. ఇది యాప్ నిర్వాహకులకు ఆదాయమే. ఎక్కువ ఆర్డర్లు ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తీసుకుంటే, ధరను బట్టి ఫ్రీ డెలివరీలు కూడా ఉంటుంటాయి. వినియోగదారులను ఆకర్షించడానికే ఇచ్చే ఇలాంటి ప్రకటనల వల్ల యాప్ నిర్వాహకులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. వినియోగించుకున్న వారు కనీసం ఒకరికైనా చెబుతారు. ఇలా ఫ్రీ పబ్లిసిటీ కూడా అందుతుంది. వినియోగదారులు పెరుగుతుంటారు. ఇక డెలివరీ బార్సును పెట్టుకుని వారికి కమీషన్స్ ఇవ్వడం పెద్ద లెక్కలోనిది కాదు.
ఆలోచన అవసరం
ఆన్లైన్ షాపింగ్‌లో మొదట అందరూ వెదికేది డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల గురించి. ఒక వస్తువు మీద డిస్కౌంట్ ప్రకటించారంటే సంబరపడిపోకూడదు. అసలు పాత ధర ఎంత ఉంది.. ప్రస్తుత ధర ఎంత ఉందనేది గమనించుకోవాలి. కొన్ని సందర్భాలలో పాత ధరను పెంచి డిస్కౌంట్ ఇస్తున్నామంటారు. కొన్ని సార్లు వస్తువు నాణ్యతలో తేడా ఉంటుంది. దీని వల్ల వ్యాపారులకు లాభమే. కనుక, ఇలాంటి వస్తువులు కొనేపుడు ఆలోచించడం మంచిది. అంతేకాదు సాధ్యమైనంత వరకు బాగా ఆదరణ పొందిన ఈ-కామర్స్ వెబ్సైట్లలో షాపింగ్ చేయడం ఉత్తమం. ఒక వెబ్‌సైట్‌ను ఎంపిక చేసుకునే ముందు రివ్యూ రేటింగ్స్ పరిశీలించాలి. సక్రమంగా ఉంది అని అనుకుంటేనే ముందుకెళ్ళాలి. సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ అంటే మొదలయ్యే వెబ్సైట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
సీజన్ సేల్స్..
ఆషాడం, శ్రావణం, దసరా, దీపావళి, సమ్మర్ ఇలా సీజన్లను బట్టి సేల్స్ ఆఫర్లు పెడుతుంటారు. వీటిల్లో భారీ డిస్కౌంట్లే ఉంటుంటాయి. ఎందులో కొంతమేర నిల్వ ఉన్న వస్తువులపై ఆఫర్లు ఇస్తుంటారు. అంతేకాదు, కొన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల మీద క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఇది ఆయా బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లను పెంచే వ్యూహంలో భాగం. వీటి వల్ల ఆయా వెబ్సైట్లు, సంస్థలు సదరు బ్యాంకులతో టైఅప్ అవుతుంటాయి.
జాగ్రత్త అవసరం
ఈ మధ్య సైబర్ నేరాలు ఏ రూపంలో జరుగుతున్నాయో చెప్పడం కష్టమనే అనిపిస్తోంది. అయితే ఆన్లైన్ షాపింగ్‌లకు ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఉన్న క్రెడిట్ కార్డులను ఉపయోగించడం సురక్షితం. ల్యాప్‌టాప్, కంప్యూటర్, బయట నెట్ సెంటర్ల నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత లాగవుట్ అవ్వడం మర్చిపోకూడదు. అంతేకాదు నిర్వహించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. లావాదేవీల ఆర్డర్ కాపీకి సంబంధించి ప్రింట్ రూపంలో వచ్చే బిల్లును భద్రపరుచుకోవాలి. వస్తువుకు సంబంధించి భవిష్యత్‌లో ఏదైనా సమస్య వాటిల్లితే ఈ బిల్లు ఉపయుక్తంగా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని విధాల జాగ్రత్త వహిస్తే మంచిదే. లేదంటే సమస్య ఎదుర్కొనాల్సి వస్తుంది.
Authorization